ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందం దాదాపు 8 గంటలకు పైగా ప్రశ్నించారు. కవిత నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్న ఈడీ అధికారులు ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. గురువారం జరిగే విచారణలో కవిత నుంచి మరింత సమాచారం రాబట్టవచ్చని ఈడీ అధికారులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
అరెస్ట్ అంటూ జోరు ప్రచారం..
అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ విచారించిన వారిని.. దర్యాప్తు అనంతరం అరెస్ట్ చేసింది. కవితను కూడా విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు కవిత అరెస్ట్ తప్పదని ఈడీ విచారణ చేయకముందే నుంచే ప్రెస్ మీట్‌లు పెట్టి.. కేసీఆర్ కుటుంబంపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇక ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే కాస్త శృతి మించి మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. కవిత నిజంగా ఏ తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని, ఒకవేళ దోషిగా తేలితే అధికారులు అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఈ వ్యాఖ్యలపై బీఆరెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బండి సంజయ్ కి వ్యతిరేకంగా బీఆరెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. హైదరాబాద్‌లో, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్ లో బీఆరెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఇక మేయర్ విజయలక్ష్మీతో పాటు బీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు సైతం బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఓ మహిళ ఎమ్మెల్సీపై అదీ గాక ఓ తెలంగాణ ఆడబిడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి నోటిని ఫినాయిల్ తో కడిగేయాలని ఘాటుగా స్పందించారు మేయర్. అంతే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆరెస్ మహిళా కార్యకర్తలు బండిసంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.
బీజేపీ ప్లాన్ ఇదేనా?
ఈ నిరసనలతో రాష్ట్ర బీజేపీ సైతం బీఆర్ఎస్ శ్రేణులకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వారు కూడా మహిళా నేతలతోనే ప్రెస్ మీట్‌లు పెట్టించి.. అధికార పార్టీని, ఆ పార్టీ మహిళా నేతలను దోషులను శిక్షిస్తే తప్పేంటని నిలదీసింది. ఇదంతా రచ్చకెక్కుతున్న క్రమంలో శనివారం సాయంత్రం వేళ ఈడీ అధికారులు కవితను ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజే అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు అనుకునే క్రమంలో మరోసారి విచారణకు ఎందుకు అనుమతిచ్చారు అనే ప్రశ్న లోకల్ లీడర్లకు అంతుపట్టలేదు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్లాన్ మరోలా ఉందని ఆ పార్టీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. ఒకేసారి కవితను అరెస్ట్ చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతాయని, అదీకాక ‘తెలంగాణ ఆడబిడ్డ’ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తూ సానుభూతి సంపాదించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆలోచించినట్లు తెలిసింది.
ఇలా చేస్తే తెలంగాణలో తమ పార్టీకే నష్టం కలుగుతుందని భావించి, కేంద్రంలోని బీజేపీ..ఈడీ ద్వారా ఈ కేసు విచారణకు కవితను మళ్లీ మళ్లీ పిలుస్తూ.. జనాల్లో ఇదంతా సాధారణమే అన్న భావన తెచ్చేందుకు వాయిదా వేసినట్లు వినికిడి. దీంతో ఈడీ విచారణ మళ్లీ మళ్లీ వాయిదాలు వేసి కొనసాగించడం వల్ల.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా మహిళా నేతల్లో ముందున్న ఉత్సాహం తర్వాత ఉండదని, ప్రజలు కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోరనేది బీజేపీ ప్లాన్.
కేసీఆర్ వ్యూహమేంటి.?
మరోవైపు కవితను అరెస్ట్ చేస్తే భారీగా నిరసనలను ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కవిత అరెస్ట్ అయితే ఆప్ మద్దతుతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆప్ నేతలతో బీఆర్ఎస్ అగ్ర నేతలు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం.. భయపడేది లేదని, పోరాటం వదిలేది లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఏదేమైనా కవిత అరెస్ట్ విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుండగా.. బీఆర్ఎస్ మాత్రం ఆ అరెస్ట్‌తో రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెడదామని భావిస్తోంది. కేసీఆర్ వ్యూహరచన ముందు రాష్ట్ర బీజేపీ నేతలు ఏ విధంగా దానికి మించి ఎత్తులు వేస్తారో ముందు ముందు వేచి చూడాలి.