చికెన్, పాలను ఒకేచోట అమ్మొద్దు..బీజేపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

చికెన్, పాలను ఒకేచోట అమ్మొద్దు..బీజేపీ ఎమ్మెల్యే

September 13, 2019

BJP lawmaker.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ప్రకారం చికెన్‌తో పాటు కోడిగుడ్లు, ఆవు పాలు ఒకే దగ్గర అమ్మే విధంగా దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో పైలట్‌ ప్రాజెక్టుగా భోపాల్‌లోని వైశాలినగర్‌లో ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసారు. కాగా, ఈ పథకానికి ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చికెన్‌ దుకాణాల వద్ద ఆవు పాల దుకాణాలను ఏర్పాటు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

చికెన్‌ దుకాణాల వద్ద ఆవు పాలను అమ్మడాన్ని బీజేపీ ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చికెన్‌, పాలను వేర్వేరు వాణిజ్య సంస్థలకు అప్పగించాలని, ఈ రెండు దుకాణాల మధ్య దూరం పెంచాలని కోరుతున్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల మత విశ్వాసాలకు భంగం కలుగుతుందని ఆయన వాదన. ఈ అంశమై ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి లఖాన్‌ సింగ్‌ స్పందించారు. ఈ పథకం ద్వారా ప్రజలకు ఒకే దగ్గర చికెన్‌, కోడిగుడ్లు, ఆవు పాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. కడక్‌నాథ్‌ చికెన్‌ను కూడా ఈ చికెన్‌ దుకాణాల్లో అమ్ముతామని పేర్కొన్నారు. అదే విధంగా గిరిజనులకు ఉపాధి దొరుకుతుందన్నారు.