బీజేపీ నేత బగ్గా అరెస్ట్.. పోలీసులపై కిడ్నాప్ కేసు - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ నేత బగ్గా అరెస్ట్.. పోలీసులపై కిడ్నాప్ కేసు

May 6, 2022

బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి తజిందర్ బగ్గాను శుక్రవారం 50 మంది పంజాబ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఆయనను పంజాబ్‌కు తరలిస్తుండగా, హర్యానాలోని కురుక్షేత్రలో ఢిల్లీ పోలీసులు అడ్డుకొని బగ్గాను తిరిగి ఢిల్లీకి తీసుకువస్తున్నారు. అంతేకాక, పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు ఢిల్లీలో నమోదైంది. ఇదంతా వివరంగా తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాలి. బీజేపీ యువనాయకుడైన తేజీందర్ పాల్ సింగ్ బగ్గా గతంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పంజాబులో కేసు నమోదైంది. ఈ క్రమంలో పంజాబులకు వచ్చి విచారణకు హాజరుకావలని నోటీసులివ్వగా.. బగ్గా విచారణకు హాజరు కాలేదు. దీంతో 50 మందితో కూడిన పంజాబ్ పోలీస్ బృందం శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న బగ్గా ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం బగ్గా తల్లి పోలీసుల తీరు సరిగా లేదని, కనీసం తలపాగా వేసుకోనివ్వలేదని పోలీసులపై మండిపడ్డారు. అరెస్టు తతంగాన్ని బగ్గా తండ్రి వీడియో తీస్తుండగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. బగ్గా అరెస్టు విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు పంజాబు పోలీసులను అడ్డుకొని బగ్గాను తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు. బగ్గాను అరెస్టు చేయడంలో పంజాబ్ పోలీసులు నిబంధనలు పాటించలేదని, అంతేకాక, వారిపై బగ్గాను కిడ్నాప్ చేశారంటూ కేసు నమోదైందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీకి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినా పోలీసులు మాత్రం కేంద్ర హోం శాఖ ఆధీనంలో ఉంటారు. దీంతో ఇన్నాళ్లూ తన రాజకీయ ప్రత్యర్ధులపై ఎలాంటి పోలీసు చర్య తీసుకోవడానికి కుదరలేదు. ఇటీవల పంజాబు ఎన్నికల్లో ఆప్ పార్టీ గెలవడంతో తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై పంజాబ్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించి కేజ్రీవాల్ కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నాడని, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పంజాబ్ పోలీసులను వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు.