వైఎస్ కుటుంబంపై, షర్మిల పార్టీపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. శనివారం విజయవాడలో పర్యటించిన ఆమె.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్ల వైఎస్ షర్మిల పార్టీ పెట్టారన్నారు. గతంలో వైఎస్ కుటుంబం ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయ లేదని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంత వరకు.. ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. షర్మిల ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా… తెలంగాణ లో ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో కూడా ఏపీలోనే షర్మిల ప్రచారం చేశారని.., అప్పుడు తెలంగాణలో ఆమె ఎక్కడ ఉన్నారన్నారు. ఏపీలో ఎందుకు పోటీ చేయడం లేదో షర్మిల చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
షర్మిల పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని డీకే అరుణ జోస్యం చెప్పారు. షర్మిల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని, ఏపీకి వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం విషయంలో జగన్, కేసీఆర్ పై మంచి అండర్ స్టాండింగ్ ఉందని.. ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని డీకే అరుణ విమర్శించారు.