రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పోటీ చేస్తానన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పినట్లు వెల్లడించారు. ఇందుకోసం గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే సీరియస్గా వర్క్ చేస్తున్నానన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే..ఈగోలు పక్కన పెట్టి లక్ష్యం కోసం పనిచేయాలని బీజేపీ నేతలకు సూచించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఈటల మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో బీజేపీ సువేందు అధికారి సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందన్నారు. బెంగాల్ మాదిరిగా ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని చెప్పారు.
త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, ఇందుకు సీక్రెట్ ఆపరేషన్ నడుస్తున్నట్లు తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమైనట్లు తెలిపారు. రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించే తత్వం సహజంగానే తెలంగాణ మట్టిలో ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.