బాబూ మోహన్ కామెడీ మామూలుగా ఉండదని మనకు తెలుసు. సినిమాల్లోకంటే నిజ జీవితంలో ఆయన మరింత సహజంగా జీవిస్తుంటారు. బండబూతులైనా, హెచ్చరికలైనా అన్నీ చాలా సహజంగా ఉంటాయి. కాకపోతే ఆయన తను రాజకీయ నాయకుడినని, ఓ పార్టీకి ఉన్నతస్థాయి ప్రతినిధిననని మర్చిపోవడం మైనస్ పాయింట్. వెంకట రమణ అనే బీజేపీ కార్యకర్తతో ఫోన్లో పచ్చిబూతులు మాట్లాడుతున్న బాబూ మోహన్ ఆడియో దీనికి తాజా తాజా ఉదాహరణ.
క్లాసికల్ లాంగ్వేజ్
‘‘ఎర్రి.. చెప్పుతో కొడతా.. ఎవడ్రా నువ్వు? నువ్వెంత, బతుకెంత? బండి సంజయ్ ఎవడ్రా, వాడు నా తమ్ముడు.. ’’ అంటూ బూతుల దండకం అందుకున్నారు బాబూ మోహన్. ఆయన కార్యకర్తలతోనే కాదు, ప్రజలతో మట్లాడే ధోరణి కూడా ఇంతే విలక్షణంగా ఉంటుంది. ఆందోల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి ప్రజలతో మాట్లాడుతూ, ‘‘కడుపు కాగానే పిల్ల పుట్టదు, 9 నెలలు ఆగాల్సిందే’’ అని ఆడవాళ్ల ముందే పచ్చిబూతులు మాట్లాడారు. ఇలాంటి భాష వల్ల, ప్రజల సమస్యలు తీర్చకుండా వారి అగ్రహాన్ని చవిచూడ్డం వల్లే టీఆర్ఎస్ పార్టీ ఆయనకు 2018 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఒక సినిమా ప్లాప్ అయితో మరో సినిమా హిట్ అవకపోతుందా అనుకుని ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయారు.
బీజేపీలోనూ అంతే..
బీజేపీ మతతత్వ పార్టీ అనే విమర్శలు ఉన్నా కేడర్ కాస్త క్రమశిక్షణగా ఉంటారని అంటారు. అయితే బాబూ మోహన్ లాంటి వాళ్లు ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదు. బీజేపీలో చేరుతున్నప్పుడు ఆయన అన్న మాటలే దీనికి ఉదాహరణ. ‘‘టీఆర్ఎస్‌లో పనికిరానివాడిని మరి బీజేపీలో పనికొస్తానా? తెలంగాణతోపాటు ఏపీలోనూ పనిచేయమన్నారు.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా…’’ అని చెప్పారు. తాజా ఆడియో ప్రకారం.. తాను ప్రపంచ స్థాయి నాయకుడినని, జాతీయ స్థాయిలో తిరుగుతానని ఆయన గొప్పలు చెప్పుకున్నారు. ఆ స్థాయి నాయకుడు తమతో ఇంత చీప్‌గా మాట్లాడడం కేడర్‌కు జీర్ణం కాని విషయం. బాబూ మోహన్ కమలదళంలోకి రాకముందే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకున్నవారికి ఆయన తిట్లు, కోపాలు చిరాకుతోపాటు తీవ్ర ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తున్నాయి. బాబూ మోహన్ మాటలు చూస్తుంటే బీజేపీకి తన అవసరం చాలా ఉందని ఆయన బలంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. బండి సంజయ్ అని ఎవడని, వాడు తన తమ్ముడని ఫ్లోలో అన్నట్లు కనిపిస్తున్నా, బండికంటే తనే పెద్ద అన్న భావన వ్యక్తమవుతోంది. బాబూ మోహన్ బ్యాగ్రౌండు, ఇలాంటి బూతులు, కలసి పనిచేస్తామంటూ కోరే కార్యకర్తలను ఘోరంగా తిట్టడం వంటి వాటిని కాషాయ అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా? 2014 ఎన్నికల్లో ఆందోల్ నుంచి పోటీచేసిన బాబూ మోహన్ కు 87,087 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమై కేవలం 2,404 ఓట్లు తెచ్చుకున్నాడు. ఈ పరిస్థితిలో బీజేపీ ప్రపంచస్థాయి, జాతీయ స్థాయి నాయకుడైన బాబూ మోహన్ కు మళ్లీ టికెట్ ఇస్తుందో లేదో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి..
ఇవి కూడా చదవండి
నా సంగతి మీకు తెలియదు.. గ్రామస్తులకు ఎమ్మెల్యే వార్నింగ్
ఏపీకి వెళ్లిపో షర్మిల..జగన్ జైలుకు పోతే అవకాశం వస్తుంది…