BJP Leader Jayaprada Comments at BJP Garjana at Rajahmundry in AP
mictv telugu

తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పిన మాజీ ఎంపీ జయప్రద

June 7, 2022

ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ప్రదేశ్‌గా మార్చేస్తున్నారని మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ…‘‘ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికే జేపీ నడ్డా ఇక్కడికి వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి కానీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎవరూ పనిచేయలేదు. ఏపీలో రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు… కానీ పేదలకు ఒరిగిందేమీ లేదు. బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్తున్నాయి. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలేదు. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని” చెప్పారు.

“రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుంచే దేశ రాజకీయాల్లోకి వెళ్లాను. కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మన ఊరు, మనవాళ్లను వదిలి వెళ్లినందుకు క్షమించండి అంటూ తెలుగు ప్రజలను కోరారు బీజేపీ గర్జనకు మద్దతిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బీజేపీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది’’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.