పోహా తింటే బంగ్లాదేశీయలు..బీజేపీ నేత వ్యాఖ్యలపై దుమారం - MicTv.in - Telugu News
mictv telugu

పోహా తింటే బంగ్లాదేశీయలు..బీజేపీ నేత వ్యాఖ్యలపై దుమారం

January 25, 2020

BJP leader.

అటుకులతో చేసే అల్పాహారం ‘పోహా’పై మధ్యప్రదేశ్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఏఏకు మద్దతుగా గురువారం ఇండోర్‌లో జరిగిన సదస్సులో తన ఇంటి నిర్మాణ పనికి వచ్చిన కూలీల ఆహార నియమాలు భిన్నంగా ఉన్నాయని, వారు పోహా తినడం బట్టి వారు బంగ్లాదేశీయులని అర్థమవుతోందన్నారు. తాను అనుమానించిన రెండు రోజుల తర్వాత వారు పనికి రావడం మానేశారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని, ప్రజలను హెచ్చరించడానికే ఇది చెబుతున్నానని పేర్కొన్నారు. 

అయితే కైలాష్‌ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోహాను తిన్నంత మాత్రన ఒక దేశ పౌరులుగా ఎలా అంచనా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆహార నియమాలను బట్టి వారి జాతీయతను ఎలా నిర్ణయిస్తారని విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోహాను అల్పాహారంగా తీసుకుంటున్నారని, అంతమాత్రాన అందరూ బంగ్లాదేశీయులు అయిపోతారా? అని ప్రశ్నిస్తున్నారు. ‘బర్గర్‌ తినే వారు అమెరికన్‌ అయిపోతారా?’, ‘నేను రోజూ పోహా తింటున్నా. అయితే నేనూ అక్రమ వలసదారేనన్నమాట’, ‘కూలీలు పోహా కాకపోతే.. బటర్‌ చికెన్‌ తింటారా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కైలాష్‌ విజయవర్గీయ వ్యాఖ్యలతో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ విభేదించారు. నేను పోహా తింటాను.. అయినంత మాత్రాన నేను బాంగ్లాదేశ్ అక్రమ వలసదారుడినా అని జవదేకర్ ప్రశ్నించారు.