BJP leader mocks Rahul Gandhi for holding actor Poonam Kaur’s hands
mictv telugu

రాహుల్‌తో ఫొటోపై ట్రోలింగ్‌.. గట్టి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్

October 30, 2022

భారత్ జోడో యాత్రలో నటి పూనమ్ కౌర్ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ క్రమంలో వీరిద్దరూ నడిచే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిద్దరూ చేతులు పట్టుకొని నడవడంపై బీజేపీ మహారాష్ట్ర నాయకురాలు ప్రీతీ గాంధీ కీలక విమర్శలు చేశారు. వారిద్దరూ నడుస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తున్నారంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటో కాస్తా వైరల్ గా మారడంతో పలువురు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్రలో నిన్న నటి పూనమ్ కౌర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తో కలసి పాదయాత్ర చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీతో మాట్లాడిన పూనమ్.. చేనేత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్‌ను కోరానని చెప్పారు. అయితే పూనమ్ కౌర్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో రాహుల్ ఆమె చేయిపట్టుకున్న ఫొటోపై కొందరు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ ఫొటోను షేర్ చేసిన బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ.. రాహుల్ తన ముత్తాత అడుగుజాడలను అనుసరిస్తున్నాడని ట్విట్టర్‌లో సెటైరికల్ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై స్పందించిన పూనమ్ కౌర్‌.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టుగా ఉందని ప్రీతి గాంధీ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం నారీశక్తి గురించి మాట్లాడారని గుర్తుంచుకోవాలని సూచించారు. తాను బ్యాలెన్స్ తప్పి కింద పడుతున్నపుడు రాహుల్ గాంధీ తన చెయ్యి పట్టుకున్నారని పూనమ్ స్పష్టం చేశారు.

మరోవైపు పలువురు కాంగ్రెస్‌ నాయకులు కూడా ఈ ట్రోలింగ్‌కు కౌంటర్ ఇచ్చారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ సైతం ప్రీతి గాంధీ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దేశాన్ని బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి స్త్రీలు పురుషులతో భుజం భుజం కలిపి, చేయి చేయి కలిపి నడవడానికి దారితీస్తుందని మీరు అనుకుంటే.. భారతదేశం గురించి పండిట్ నెహ్రూ దృష్టి మాత్రమే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్, స్వాతంత్ర్య సమరయోధుల సమానత్వ భారతదేశం కల కూడా సాకారం అవుతుంది’’ అని ప్రియాంక చతుర్వేదీ ట్వీట్ చేశారు.