BJP leader subjected to honeytrap in bengalore
mictv telugu

‘హనీట్రాప్’కు గురై బీజేపీ నేత ఆత్మహత్య

May 18, 2022

BJP leader subjected to honeytrap in bengalore

ఇప్పటివరకు హనీట్రాప్ రక్షణ రంగానికే పరిమితమైందనే భావన ఉండేది. శత్రు దేశాలు అందమైన అమ్మాయిలను ఎరగా వేసి రక్షణ రహస్యాలను వారి ద్వారా రాబట్టేవారు. అయితే ఇది రాజకీయ నాయకులకు కూడా పాకింది. తాజాగా ఈ ఉచ్చులో చిక్కుకొని ఓ బీజేపీ నేత ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. బెంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు అనంతరాజుకు సోషల్ మీడియాలో రేఖ అనే అమ్మాయి పరిచయమైంది. అనంతరం స్నేహితురాలిగా నటించి మెల్లగా అనంతరాజును ముగ్గులోకి దింపింది. ఇందుకు ఆమెకు ఆమె భర్త వినోద్ సహకరించేవాడు. తన భర్తను రేఖ స్నేహితుడిగా అనంతరాజుకి పరిచయం చేసింది.

దీంతో అనంతరాజుకు ఎలాంటి అనుమానం రాలేదు. కొంతకాలానికి అనంతరాజును రెచ్చగొట్టిన రేఖ.. అతని ప్రైవేటు ఫోటోలు, వీడియోలు సేకరించింది. దాంతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడం ప్రారంభించింది. ఇందుకు గాను స్పందన అనే మరో మహిళ సహాయం తీసుకున్నారు. వీరు ముగ్గురూ కలిసి అనంతరాజును డబ్బుకోసం వేధిస్తుండడంతో మనస్థాపానికి గురైన అనంతరాజు ఉరి వేసుకొని మరణించాడు. సూసైడ్ నోట్‌లో భార్యకు క్షమాపణలు అడగడంతో పాటు వేధించిన ముగ్గురి పేర్లను రాశాడు. దాంతో అనంతరాజు భార్య ఆ ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.