బాబు-పవన్ కల్యాణ్ బంధానికి బ్రేక్..! - MicTv.in - Telugu News
mictv telugu

బాబు-పవన్ కల్యాణ్ బంధానికి బ్రేక్..!

October 22, 2022

టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మధ్య బంధానికి బీజేపీ బ్రేక్ వేస్తుందా? వచ్చే ఎన్నికల్లో పొత్తులకు మోకాలాడ్డుతుందా?బాబుతో దోస్తీ కావాలంటే బీజేపీని పవన్ కల్యాణ్ వదులు కోవాల్సిందేనా? ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తోంది.

పవన్ కల్యాణ్‌కు షాక్

ఏపీలో జనసేన-బీజేపీ దోస్తీ అధికారికం. చంద్రబాబు-పవన్ కల్యాణ్ స్నేహం అనధికారికం. మూడు పార్టీలు.. ముగ్గురు నేతలు.. దారులు వేరైనా వీరి టార్గెట్ ఒక్కటే. వైసీపీ ప్రభుత్వాన్ని దించేయాలని. ఎవరికివారే పోరాటాలు చేస్తారు. అప్పుడప్పుడు జనసేన,బీజేపీ నేతలు కలిసి పనిచేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌కు లోలోపల మంచి దోస్తీ ఉంది. ఈ మధ్య ప్రెస్ మీట్‌లో ఇద్దరూ కలిసి మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యమన్నారు. జగన్‌ని దించేందుకు అవసరమైతే ఎవరితోనైనా కలుస్తామన్నారు. ఇది జరిగిన వారం తర్వాత బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ టీడీపీ, జనసేనలకు ఝలక్ ఇచ్చారు.

టీడీపీతో పొత్తు లేదు

ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోబోమని ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకుని చేధు అనుభవాలు చూశామని..అందుకే ఈసారి పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ పై అంతర్గతంగా చర్చించుకుంటున్నామని సునీల్ దేవధర్ చెప్పారు. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజుపై కన్నాలక్ష్మీనారాయణ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని తేల్చిచెప్పారు.

షాక్ నుంచి ఇంకా తేరుకోని బీజేపీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీకి బాగా దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత ఏర్పడిన కేబినెట్లో బీజేపీని చేర్చుకున్నారు. బీజేపీ నేతలు కామినేని శ్రీనివాసరావు ,మాణిక్యాలరావులకు మంత్రి పదవులు ఇచ్చారు. నాలుగేళ్లపాటు టీడీపీ-బీజేపీ బంధం సాఫీగా సాగింది. ఆతర్వాత ఎన్నికలకు ముందే బీజేపీకి, ఎన్డీయేకి చంద్రబాబు కటీఫ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన చంద్రబాబు..వైసీపీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయారు. అధికారంలోకి వచ్చిన జగన్..ఢిల్లీ బీజేపీ పెద్దలతో ఎప్పుడు టచ్ లో ఉన్నారు. ఆ మధ్య ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఓ సమావేశంలో ప్రధాని మోదీని కలిసి మాట్లాడారు. ఆతర్వాత చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతున్నారని పుకార్లు పుట్టాయి. ఇటు ఎలాగూ పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. చంద్రబాబుతో పీకేకి మంచి స్నేహం ఉంది. ఇది రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించారు. కానీ ఇప్పుడు సునీల్ దేవధర్ చేసిన కామెంట్స్ తో ఇదంతా కుదరదని అనిపిస్తోంది.