రాజకీయాల్లో ఎవరైనా ఎందుకు వస్తారు? పదవుల కోసం తద్వారా వచ్చే గుర్తింపు కోసం. అయితే ఓ నాయకుడు మాత్రం పార్టీ ఇచ్చిన పదవిని తిరస్కరించాడు. పదవుల కోసం కొట్లాడే నాయకులున్న ఈ కాలంలో రాజ్యసభ ఎంపీ పదవిని తృణప్రాయంగా త్యజించే వ్యక్తిత్వం ఉండడం నిజంగా గొప్ప విషయం. రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడడం తెలిసిందే. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్ధులను ప్రకటించాయి. అధికార బీజేపీ కూడా వివిధ రాష్ట్రాల నుంచి తమ అభ్యర్ధులను ప్రకటించింది. వీటిలో కర్ణాటక నుంచి నిర్మల్ కుమార్ సురానా పేరును మొదట ప్రతిపాదించారు. సురానా ప్రస్తుతం ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీ సీటును పార్టీ ఆఫర్ చేసినా సురానా దానిని తిరస్కరించాడు. ఇప్పుడున్న హోదాలో పార్టీ కోసం పనిచేయడానికే సమయం సరిపోతుంది. ఇక రాజ్యసభ సభ్యుడిగా అదనపు బాధ్యతలను మోయలేనంటూ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ ద్వారా తెలియజేశాడు. దీంతో ఆయన స్థానంలో నిర్మలా సీతారామన్ పోటీ చేయనున్నారు. గెలుపు ఖాయంగా కనపడుతున్నా పదవిని వద్దన్న సురానాని చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సురానా బీజేపీలో చేరకముందు బిజినెస్ మ్యాన్‌గా సక్సెస్ అయ్యారు..