ఇస్లాం మత స్థాపకుడు మహ్మద్ ప్రవక్తపై ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఢిల్లీ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీపై కూడా అలాంటి వేటు వేసింది. ఈ వివాదం అంతర్జాతీయంగా భారత్‌ను కొంత మేర ఇబ్బంది పెట్టింది. ఈ విషయం సద్దుమణగే లోపలే అలాంటిదే మరో వివాదం వెలుగుచూసింది.
బీజేపీకే చెందిన యూత్ వింగ్ సభ్యుడు, స్టూడెంట్ కౌన్సిల్ సభ్యుడు హర్షిత్ శ్రీవాత్సవ అభ్యంతర ట్వీట్లు చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘శ్రీవాత్సవ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా ఉన్నాయి. మత ఘర్షణలు, రెచ్చగొట్టే విధంగా ఆయన పదాలు ఉన్నాయి. అందుకే ఆయనపై చర్యలు తీసుకున్నాం. సామాజిక విద్వేషాలు పెంచాలనుకునేవారు ఎవరైనా సరే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం’ అని తెలిపారు.