బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చించకుండా.. దేశాన్ని అవమానించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడరంటూ బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శించేందుకే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని.. బడ్జెట్‌పై కేసీఆర్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. అసలు ఆ ప్రసంగంలో కాంగ్రెస్ ను పొగడటం, బీజేపీని విమర్శించటం తప్పా ఇంకేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోసం ఇన్ డైరెక్టుగా ఈ వ్యాఖ్యలు చేసినట్టుందన్నారు.
ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్.. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదు? డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ, నిరుద్యోగ భృతిపై ఎందుకు చర్చ జరపలేదు? ఎస్సీలకు మూడెకరాల భూమి ఏమైంది? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడంటూ సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులను తిట్టి మళ్ళీ వాళ్ళతో జత కడుతున్నాడని మండిపడ్డారు. మజ్లిస్ ను పొగడని రోజు ఉండదని, కల్వకుంట్ల ఫ్యామిలీ, మజ్లిస్ బ్రదర్స్ ఒకరినొకరు పొగుడు కుంటారని ఆరోపించారు. తిరుమలరాయుని పిట్టకథ దేశంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే వర్తిస్తుందన్నారు.
‘కేసీఆర్ రాజీనామా చేస్తానని గతంలో ఎన్నోసార్లు చెప్పారని, ఇంకో ఆరేడు నెలలు ఆగితే ఆయన రాజీనామా చేసే పరిస్థితి తప్పకుండా వస్తుందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ చెప్పిన లెక్కలపై తాను చర్చకు సిద్ధమని.. ఎక్కడికి రమ్మంటారో కేసీఆరే చెప్పాలని సవాల్ విసిరారు. ‘చర్చ కోసం ప్రెస్‌క్లబ్‌కు వస్తారా? అమరవీరుల స్థూపం వద్దకు వస్తారా?ప్రగతి భవన్‌లోనా.. ఫామ్‌హౌస్‌లోనా.. కేసీఆర్‌తో చర్చకు ఎక్కడైనా నేను సిద్ధం’ అంటూ ఛాలెంజ్ చేశారు.