లేడీ పవర్ స్టార్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే నటి సాయి పల్లవి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందూ సంఘాలు ఆమెను ఓ రేంజులో ట్రోల్ చేస్తున్నాయి. ఓ పోలీస్ స్టేషన్లో అయితే కేసు కూడా నమోదైంది. తాజాగా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై అలనాటి లేడీ సూపర్ స్టార్, బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ‘డబ్బు కోసం దొంగతనం చేసే దొంగ ఎవరినైనా కొట్టడం, తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం రెండూ ఒకటే ఎలా అవుతాయి? దోపిడీ దొంగ ఉద్దేశం వేరు, తల్లి ఉద్దేశం వేరు.
ఎవ్వరైనా సరే తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ అంశాన్ని సున్నితంగా పక్కన పెట్టడం మంచిది. నేటి సమాజంలో మనం మాట్లాడే ప్రతీ మాట టెక్నాలజీ వల్ల కోట్ల మందికి వెంటనే చేరిపోతున్నాయి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే పట్టేసుకుంటున్నారు. అందుకని, చాలా జాగ్రత్తగా, సామాజిక స్పృహతో మెలగడం చాలా అవసరం’ అని అభిప్రాయపడ్డారు. అంతేకాక, ‘సాయిపల్లవితో అలా కావాలనే మాట్లాడించి ‘విరాటపర్వం’ సినిమాను ఇంకా ప్రమోట్ చేసుకోవడానికి చిత్ర నిర్మాతలు ప్రయత్నించారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు’ అని అనుమానం వ్యక్తం చేశారు.