ఈ సన్మానాలెందుకు? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ సన్మానాలెందుకు?

August 26, 2017

 

ఉప రాష్ట్రపతి వెంకయ్యపై తెలుగు రాష్రాల ప్రభుత్వాలు చూపుతున్న అభిమానం హద్దులు దాటుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆయన్ను ఘనంగా సత్కరించడం తెలిసిందే. ఈ రోజు ఏపీ ప్రభుత్వం కూడా అమరావతిలోని సచివాలయంలో ఆయనను ఘనంగా సత్కరిస్తోంది.

తెలుగు వ్యక్తి ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించడం పెద్ద ఘనత కనుక ఆయన్ను సత్కరించడం తప్పేమీ కాదని ఈ ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే విపక్షాలు, మేధావులు,  ప్రజాసంఘాలు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. వెంకయ్య బీజేపీ నాయకుడని, ఉప రాష్ట్రపతి పదవి ఎన్నికల్లో  ఆ పార్టీ తరపున గెలిచాడు తప్పిస్తే తెలుగు రాష్ట్రాలకు ఈ విషయంలో పెద్ద సంబంధం లేదని అంటున్నాయి. గతంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులను అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవ రెడ్డి, వరాహగిరి వెంకటగిరితో పోలిస్తే వెంకయ్య చాలా సాధారణ నాయకుడని, సన్మానాల పేరుతో ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదని అంటున్నాయి. సన్మానంపై కోట్లు తగలేసి పత్రికల్లో, టీవీ చానళ్లలో ప్రకటనలు ఇవ్వడంపై మండిపడుతున్నాయి.

‘ఉప రాష్ట్రపదవి పదవిని ఈ సన్మానాల పేరుతో రాజకీయ చేస్తున్నారు. అది రాజ్యాంగ పదవి. ఈ సన్మానాలను చూస్తోంటే వెంకయ్య ప్రధానమంత్రో, లేకపోతో ఢిల్లీకి ముఖ్యమంత్రో అయిపోయారన్న భ్రమ కలుగుతోంది. గతంలోనూ ఉప రాష్ట్రపతులు ఉన్నారు. వాళ్లు కూడా ఏదో ఒక రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లే. కానీ నాకు తెలిసినంతవరకు వాళ్ల రాష్ట్రాలు వాళ్లను ఇన్ని కోట్లు ఖర్చు చేసి సన్మానించిన దాఖాలు లేనేలేవు. ఈ సన్మానాల వెనక పెద్ద రాజకీయాలు ఉన్నాయి… ’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. వెంకయ్య నాయుడు కూడా తన సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో చంద్రబాబు ఆయనను సత్కారం చేస్తున్నారని, కేంద్రం నుంచి ఏవో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందకపోయినా.. వెంకయ్య ద్వారా కేంద్రం నుంచి ఏవో ప్రయోజనాలు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపదవి రాజ్యంగ పదవి అయినప్పటికీ వెంకయ్య ఆ పదవి చేపట్టడంతో అది రాజకీయ రంగు పులుముకుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఆందోళనకరమని అన్నారు.

తెలంగాణ, ఏపీలకు వెంకయ్య చేసిందేమిటి?

తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ప్రతిగా మొదలైన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి వెంకయ్య. బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా, అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తెలంగాణకు చేసిందేమీ లేదు. పైగా చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడారు. విభజనతో తెలుగువాళ్లు విడిపోకూడదని సుద్దులు చెప్పారు కూడా. కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు పెద్దగా చేసిందేమీ లేదు కూడా. కేంద్ర నిర్మించే ఇళ్లయినా, మరొకటైనా దామాషా పద్ధతిలో.. అంట జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయిస్తారు తప్పిస్తే వ్యక్తుల అభిరుచులపైన కాదు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండుంటే.. వెంకయ్య తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కేటాయించి ఉంటే ఒక అర్థం ఉండేది.

ఏపీకి చేసిందేమిటి?

రైతు కుటుంబం నుంచి వచ్చానని వెంకయ్య మాటిమాటికీ చెబుతుంటారు. అయితే ఇప్పటికీ తను రైతులా జీవిస్తున్నానని చెప్పారు. రైతుకుటుంబం నుంచి వచ్చినప్పడు ఎన్ని ఆస్తులున్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో కూడా చెప్పరు. దీని వెనక మతలబును సులువుగా గ్రహించొచ్చు. డబ్బు కోసమే రాజకీయాలు చేస్తారన్న సామాన్యుల అభిప్రాయం వెంకయ్యకూ వర్తిస్తుంది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల విలువ, అవి ఏ మార్గంలో వచ్చాయో ఎవరూ అడగడడం లేదు. అడిగినా చెప్పరు. బీజేపీ నేతగా ఏపీకి వెంకయ్య చేసిందేమీ లేదని ఆ మిత్రపక్షమైన టీడీపీ నేతలే బహిరంగంగా అనేస్తున్నారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వెంకయ్య డిమాండ్ చేశారు తప్పిస్తే సాధించింది ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ గట్టి ప్యాకేజీకి కూడా తీసుకురాలేకపోయిన వెంకయ్య రాష్ట్రానికి ఏం చేశారని ఈ సత్కారమని నిలదీస్తున్నారు. బీజేపీలో వెంకయ్యది చాలా సాధారణ స్థాయి మాత్రమేనని, అయనకే నిజంగా పలుకుబడి ఉండే ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చుండేదని అంటున్నారు.

విజయవాడ పౌరులకు నరక సన్మానం..

ఏతావాతా తేలుతున్నదేమంటే వెంకయ్య సత్కారాలు  మామూలు సత్కారాలు కావని. వీటికి వెనుక లోగుట్టు ఉందని. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గన్నవరం విమానాశ్రయం నుంచి సచివాలయం వరకు వెంకయ్య, చంద్రబాలు చేసిన షో మరో ఎత్తు. దాదాపు 23 కి.మీ దూరం ట్రాఫిక్ నిలిపేసి, ప్రజలకు నరకం చూపించి వీరు చేసిన సన్మాన ఊరేగింపుపై విజయవాడ వాసులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుబడుతున్నామని చెప్పుకునే పెద్దలు చేయాల్సిందిలాగేనా అని మండిపడుతున్నారు. వెంకయ్య రోడ్ షో వల్ల రెండు గంటలపాటు వేలాది వాహనాలు నిలిచిపోయాయి.ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్ళాల్సిన రోగులు నానా తిప్పలూ పడ్డారు. కానీ సన్మానాల్లో ముగినిపోయిన పాలకులకు ఇవేమీ పట్టవు కదా.