BJP leader's son arrested over murder of Uttarakhand girl who worked at his resort
mictv telugu

రిస్టార్ట్‌లో 19 ఏండ్ల యువతి హత్య.. బీజేపీ నాయకుడి కొడుకు అరెస్ట్

September 24, 2022

19 ఏండ్ల యువతి మిస్సింగ్, మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడి కుమారుడు పుల్కిత్ ఆర్య పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం పౌరీ జిల్లాలోని యమకేశ్వర్ బ్లాక్‌లో రిసార్ట్‌లో ఉన్న బీజేపీ నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత 5 రోజులుగా అదృశ్యమైన అంకితా భండారి అనే యువతి.. పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ లో రిసెప్షినిస్ట్ గా పనిచేస్తోంది. ఈ నెల 18 వ తేది నుంచి ఆమె కనిపించట్లేదు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు బహిర్గతమయ్యాయి. నిందితుడు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యగా తెలిసింది. అతనికి తోడు మరో ఇద్దరు రిసార్ట్ ఉద్యోగులకు కూడా ఇందులో భాగముందని, పోలీసులు వారిని కూడా అరెస్టు చేశారు. పుల్కిత్ ఆర్య హరిద్వార్‌కు చెందిన బిజెపి నాయకుడు, ఉత్తరాఖండ్ మతి కళా బోర్డు మాజీ ఛైర్మన్ వినోద్ ఆర్య కుమారుడు.

రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న అంకితా భండారి.. ఈ నెల 18న రాత్రి 8 గంటల సమయంలో పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి రిషికేష్ వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. తిరిగి వస్తుండగా చిలా రోడ్డులోని కెనాల్ వద్ద మద్యం తాగేందుకు ఆగారు. వారు మద్యం తాగుంటే యువతి వారి కోసం వేచి చూసింది. ఆ తర్వాత యువతికి, వారికి మధ్య గొడవ మొదలైంది. రిసార్టులో వీరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని బయటపెడతానని ఆమె బెదిరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితులు ఆమెను కెనాల్‌లోకి తోసేశారు.

ఆమె తప్పిపోయిందని కంప్లైంట్ రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టి రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను విచారించగా.. యువతిని హత్య చేసి చీలా కాలువలో పడవేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసినట్లు పౌరి అదనపు పోలీసు సూపరింటెండెంట్ శేఖర్ చంద్ర సూయల్ పిటిఐకి తెలిపారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని, అయితే కఠినంగా విచారించగా నేరం అంగీకరించారని ఏఎస్పీ తెలిపారు. కాలువలో బాలిక మృతదేహాన్ని వెతకడానికి ఒక బృందాన్ని పంపామని, రెవెన్యూ పోలీసుల నుండి సాధారణ పోలీసులకు బదిలీ చేసిన 24 గంటల్లో కేసును ఛేదించినట్లు ఆయన చెప్పారు. ముగ్గురు నిందితులను కోట్‌ద్వార్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు అంకితా భండారీ హత్య కేసులో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆగ్రహించిన గ్రామస్తులు రిసార్ట్‌ను ధ్వంసం చేసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న భారీ పోలీసు బలగాలు గ్రామస్తులను అడ్డుకున్నారు. పుల్కిత్ ఆర్యను కోర్టుకు తీసుకువెళుతున్న పోలీసు వాహనాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారని, నిందితులతో పాటు వారిని కూడా కొట్టారని తెలుస్తోంది.