అగ్నిపథ్ నిరసనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రం చేతిలో ఉన్న శాంతిభద్రతల వ్యవస్థను వాడకుండా కేంద్రం ఆస్తులే కదా అని వదిలేశారని మండిపడ్డారు. ఆస్తులు రాష్ట్రానివైనా, కేంద్రానివైనా ప్రజల ఆస్తులన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శుక్రవారం ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ‘కరోనా కారణంగా గత రెండేళ్లుగా రిక్రూట్ మెంట్ ఆలస్యమైంది.
ఆర్మీ అభ్యర్ధులు ముసుగులో రాజకీయ శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించాయి. రాజ్ భవన్ ముట్టడి, సికింద్రాబాద్ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉంది. ప్రజా మద్ధతు లేని వాళ్లే అసహనానికి గురై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా అధ్యక్షుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు మద్దతు తెలిపేందుకు వెళితే అరెస్ట్ చేశారు. మరి విధ్వంసాలు సృష్టించిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. ప్రభుత్వ సహకారంతోనే ఈ ఘటన జరిగింది. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.