దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద తనపై రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను అయన తిప్పికొట్టారు. వారి ఆరోపణలే నిజమైతే.. తనపై విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. తన ఆస్తుల వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నట్టు రఘునందన్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడానికి సిద్ధమేనా? అని నిలదీశారు.
ఎన్నికల అఫిడవిట్లో రోహిత్ రెడ్డి తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపించారు రఘునందన్. 2009 కంటే ముందు స్వీడన్ వర్సిటీలో చదివినట్టుగా వివరాలు ఇచ్చారని తెలిపారు. అది 2018 నాటికి ఇంటర్‌గా ఎలా మారిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పన్ పల్లి భూములకు, రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేనట్టయితే చీఫ్ సెక్రటరీకి లేఖ రాయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రోహిత్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకంటే ఏం మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రోహిత్ రెడ్డి మాల తీసిన తర్వాత తాను అన్నింటికి జవాబు చెప్తానని స్పష్టం చేశారు.
“తెలంగాణతో, తెలంగాణ ఉద్యమంతో రోహిత్ రెడ్డికి సంబంధం లేదు. అదృష్టం కలిసివచ్చిన ఎమ్మెల్యే నాపై విమర్శలు చేస్తున్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో రోహిత్‌రెడ్డి అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్ను విమర్శించారు. దొరలు తిరిగే కారు కావాలా? అన్నం తినే చెయ్యి కావాలా? అని అడిగారు. అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టి కాంగ్రెస్‌ను గోదావరిలో ముంచారు. దొరలను విమర్శించి వారి వద్దే చిలక పలుకులు పలికే చిలకగా మారారు. నన్ను అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై నాడు అందరినీ అడిగాను. నేను అక్రమంగా సంపాదిస్తే ఎందుకు విచారణ చేయలేదు. నేను తప్పు చేయనందునే ఎలాంటి విచారణ చేయలేదు” అని రఘునందన్ రావు అన్నారు.
ఇవి కూడా చదవండి
హాజరుకావాల్సిందే.. రోహిత్ రెడ్డికి ఈడీ ఝలక్
సీఎం కేసీఆర్‌తో భేటీ ఎఫెక్ట్.. ఈడీకి షాకిచ్చిన రోహిత్ రెడ్డి