BJP MLA Raghunandan Rao condemned Telangana Minister Malla Reddy's comments on IT attacks.
mictv telugu

నోటిసులు ఇస్తేనే గుండెనొప్పి వస్తదా?.. రఘునందన్ రావు

November 23, 2022

ఐటీ దాడులపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఖండించారు. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదని సూచించారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని అన్నారు. ఐటీ అధికారులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి చేసిన ఆరోపణలు సరైనవి కాదని హితవు పలికారు.

ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ.. ఆస్పత్రికి వెళ్తున్నారని పరోక్షంగా మంత్రి కుమారుడిపై విమర్శలు గుప్పించారు రఘునందన్‌. మల్లారెడ్డి కుమారుడు నిన్న ఉదయం కూడా వాకింగ్‌ చేశారు కదా.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే.. ఐటీకి సమాచారం ఇచ్చారని తెలుస్తోందని పేర్కొన్నారు. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు.