BJP MLA, Raja Singh’s wife , seeks more time, reply to showcause notice,
mictv telugu

బీజేపీకి MLA రాజాసింగ్ భార్య లేఖ.. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ

September 2, 2022

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించే రీతిలో ఉన్న ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా.. పార్టీ నుంచి ఎందుకు బ‌హిష్క‌రించ‌కూడ‌దో తెల‌పాలంటూ రాజాసింగ్ కు నోటీసులిచ్చింది. ఈ క్ర‌మంలో నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన గడువు నేటితో ముగుస్తుంది. కానీ ప్ర‌స్తుతం జైల్లో ఉన్న రాజాసింగ్ పార్టీ నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు, ఎమ్మెల్యే రాజాసింగ్ స‌తీమ‌ణి బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి లేఖ రాశారు. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త జైలులో ఉన్న కార‌ణంగా నిర్దేశిత స‌మ‌యంలో వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం లేద‌ని పేర్కొన్నారు. పార్టీ నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు త‌న భ‌ర్త‌కు మ‌రింత గ‌డువు ఇవ్వాల‌ని లేఖ‌లో కోరారు.అయితే రాజాసింగ్ భార్య రాసిన ఈ లేఖ‌పై పార్టీ తీసుకోనున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను వ్యతిరేకిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ పాత బస్తీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పాతబస్తీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎంఐఎం నాయకులు. చివరకు రాజాసింగ్ ను ఆగస్ట్ 25న పిడి యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.