BJP MP Arvind says he does not support Bandi Sanjay's comments on BRS MLC Kavitha
mictv telugu

కవిత‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించను.. ఎంపీ అర్వింద్

March 12, 2023

BJP MP Arvind says he does not support Bandi Sanjay's comments on BRS MLC Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శనివారం బీఆర్ఎస్ మహిళా శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ ఇష్యూపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కవిత‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించను అని అర్వింద్ తేల్చి చెప్పారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. ఆయన వ్యాఖ్యలకు.. ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారని చెప్పారు. కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన కామెంట్స్.. బీఆర్ఎస్‌కు ఓ ఆయుధంలా మారాయని, సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని అరవింద్ అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నప్పుడు విపరీతమైన బాధ్యతలు ఉంటాయని.. ఆ మాటలను ఉపసంహరించుకోవాలని అన్నారు.

కవిత ఈడీ ఆఫీసులో ఉంటే, తెలంగాణ క్యాబినెట్ అంతా ఢిల్లీలో మకాం వేసిందని ఎంపీ అరవింద్ విమర్శించారు. ఇదే చిత్తశుద్ది ప్రజల అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం బాగుపడేదన్నారు. దర్యాప్తునకు కవిత సహకరించలేదని తెలిసిందన్నారు. కవిత ఈడీ విచారణ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఈడీ అధికారులు అడిగితే.. ఏమో, తెలవదు, గుర్తులేదు అని కవిత సమాధానం చెప్పినట్టు తెలిసిందన్నారు. కవిత చేతికి రూ.20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు అన్నారు అరవింద్.