బాంబు పేలుడు కేసులో నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ మళ్లీ కలకలం రేపారు. దేశంలో అందరికీ తమను తాము రక్షించుకునే హక్కు ఉందని, హిందువులందరూ తమ ఇళ్లలలో కత్తులను పదునుపెట్టి ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. లవ్ జీహాద్‌ను గట్టిగా ఎదుర్కోవాలన్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గలోజరిగిన హిందూ జాగరణ వేదిక సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులపై దాడులు జరుగుతున్నాయి. వారిని అగౌరవిస్తున్నారు. వీటికి ప్రతిస్పందించే హక్కు హిందువులకు ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వారు ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోవాలి. వీలు కాకపోతే కనీసం కూరగాయల కత్తినైనా పదును పెట్టుకోవాలి. దుండగులు ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తే దీటుగా జవాబివ్వాలి. ఇది మన హక్కు,’’ అని ఆమె అన్నారు. క్రైస్తవ పాఠశాలలపైనా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలను మిషనరీ స్కూళ్లలో చేర్పిస్తే తర్వాత వారు తల్లిదండ్రులను పట్టించుకోరని, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలకు మంచిబుద్ధులు చెబుతూ వారిని కాపాడుకోవాలని అన్నారు. 2008లో మహారాష్ట్రలోని మాలెగావ్‌లో జరిగిన బాంబు పేలుడులో ప్రగ్యా హస్తమున్నట్లు కేసు నమోదు కావడం తెలిసిందే. ఆమె ప్రస్తుతం భోపాల్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.