తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది.
ఆదివారం హెచ్ఐసీసీ (HICC) వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పలువురు నాయకులు మాట్లాడారు.టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో వుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం చెప్పిందే సీఎం కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. ప్రగతిభవన్‌లోకి మంత్రులకు సైతం ప్రవేశం లేదని అన్నారు. కానీ ఎంఐఎం నేతలు మాత్రం సీఎం దగ్గరకు నేరుగా వెళ్తారన్నారు. కుటుంబమే కేబినెట్‌గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ‘తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను బీజేపీ అర్థం చేసుకుందని, అందుకు అనుగుణంగా మద్దతు ఇవ్వటం వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు. ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారన్నారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను తెరాస ప్రభుత్వం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. నీళ్లు, నిధులు, నియామాకాలు పేరిట అధికారంలోకి వచ్చిన తెరాస పట్ల తెలంగాణ ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు.