BJP National President JP Nadda and Hero Nithin met at Shamshabad Novotel Hotel In Hyderabad
mictv telugu

తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్న హీరో నితిన్ !

August 28, 2022

తెలంగాణపై బీజేపీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధిక సీట్లు రాబట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు.. గత ఆదివారం తెలంగాణలో పర్యటించిన అమిత్‌ షా ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ అమిత్‌ షా, జూ.ఎన్టీఆర్‌ భేటీపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హీరో నితిన్‌ భేటీ అయ్యారు.

హనుమకొండలో ప్రజాసంగ్రామ యాత్ర మూడో దశ ముగింపు సందర్భంగా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జేపీ నడ్డాతో సినీ హీరో నితిన్‌తోపాటు మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ భేటీ అయ్యారు. అయితే ఆల్ ఆఫ్ సడెన్ గా హీరో నితిన్ ను బీజేపీ టచ్ లోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీకి సపోర్ట్ గా పెద్ద ఎత్తున సినీ గ్లామర్ ను పెంచాలనే వ్యూహత్మకంగా పావులు కదుపుతోందని చర్చ మొదలైంది. నితీన్‌ కొత్త మూవీ మాచర్ల నియోజకవర్గంపై నడ్డా ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. ఇద్దరి మధ్య సినిమాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరో వైపు తెలంగాణలో బీజేపీ తరఫున హీరో నితిన్ ప్రచారం చేయనున్నాడని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మిథాలీ రాజ్‌తో భేటీ అయిన నడ్డా… మిథాలీరాజ్‌తో శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా.. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో సంభాషణ గొప్పగా సాగిందని వివరించారు. ప్రధాని మోదీ అందించిన వ్యక్తిగత మద్దతు, మార్గదర్శకత్వాన్ని మిథాలీ రాజ్ ప్రశంసించినట్టుగా ఆయన తెలిపారు.