మోడీని బోడీ అన్నాడు...ఇప్పుడు జోడి కట్టిండు..! - MicTv.in - Telugu News
mictv telugu

మోడీని బోడీ అన్నాడు…ఇప్పుడు జోడి కట్టిండు..!

July 27, 2017

ఆయన చరిత్ర చూస్తే అంతా సోషలిస్ట్, సెక్యులర్ పని విధానమే కనబడుతుంది.బీహార్ రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా పేరు సంపాదించిన ఆయన ఎవరో కాదు.ఇట్ల రాజీనామా చేసి,అట్ల ప్రమాణ స్వీకారం చేసిన సరికొత్త ముఖ్యమంత్రి నితీష్ కుమార్.నితీష్ ది అంతా..సోషలిస్ట్ రాజకీయాలతో కూడుకున్న ప్రయాణం.జయప్రకాష్ నారాయణ్,రామ్ మనోహర్ లోహియా,ఎస్ ఎన్ సింహా,కర్పురీ థాకూర్,వి పి సింగ్  అడుగుల్లో అడుగైనట్టు ఆయన చెప్పుకుంటాడు.అవినీతికి వ్యతిరేకంగా 1974 నుంచి 1977 వరకు జరిగిన జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో పాఠాలు నేర్చుకున్నానని గల్లా ఎగరేసి మరి నితీష్ తన కెరియర్ ను బిల్డ్ చేసుకున్నాడు.అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న యూ టర్న్.. రాజకీయ వర్గాల్లో రకారకాలు చర్చలు వినిపిస్తున్నాయి.బిజెపితో ఎట్టి పరిస్ధితుల్లో అంటకాగేది లేదని అనేక సార్లు ఆయన ప్రకటించారు.

2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వాన్ని దేశంలో అందరికంటే తీవ్రంగా వ్యతిరేకించింది నితీష్ కుమారే.బీహార్ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో అసహనం పెరిగిపోతుందనే నినాదాన్ని చక్కగా వాడుకున్న పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ కుమారే.బిజెపి తీరుకు వ్యతిరేకంగా రచయితలు,సాహితీకారులు..కేంద్ర సాహితీ అవార్డులను వాపస్ చేసే కార్యక్రమానికి డైరెక్షన్ అంతా నితీష్ దే అనే ప్రచారం కూడ ఉండే.ఇంతే కాదు గుజరాత్ లో పటేల్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న హార్ధిక్ పటేల్ ను బహిరంగంగా సమర్ధించిన నితీష్ కుమారే అనేది అందరికి తెలుసు.అయితే బిజెపికి కొరకరాని కొయ్యగా ఉన్న నితీష్ ,బిజెపితో జత కట్టడం ఖచ్చితంగా దేశరాజకీయాలలో సర్జికల్ స్ట్రైక్ లాంటిదే.