BJP Picks Ex MLA Who "Jumped Into River To Save Lives" In Gujarat's Morbi
mictv telugu

నదిలో దూకాడని మాజీ ఎమ్మెల్యేకు బీజేపీ టిక్కెట్

November 10, 2022

BJP Picks Ex MLA Who "Jumped Into River To Save Lives" In Gujarat's Morbi

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన గుజరాత్ లోని మోర్బీ వంతెన ఘ‌ట‌న‌లో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 న జరిగిన ఈ విషాద ఘటనలో 177 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. దాదాపు 140 ఏండ్ల క్రితం బ్రిటిషర్స్ కట్టించిన ఈ బ్రిడ్జికి తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేసి, వాడుకలోకి తెచ్చారని సామాజిక వాదులు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. వాచీలు, గోడ గడియారాలు తయారు చేసే ఓ ప్రైవేట్ కంపెనీకి బ్రిడ్జి మరమ్మత్తులు కాంట్రాక్ట్ ఇచ్చిందని అక్కడి బీజేపీ సర్కార్‌ను దుమ్మెత్తిపోశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం చనిపోయిన వాళ్లకి ఎక్స్‌గ్రేషియా, గాయాలపాలైన వారికి ఉచిత వైద్యంతో పాటు, దీనికి కారణమైన అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది.

రాబోయే ఎన్నికలపై ఈ బ్రిడ్జి ఘటన ప్రభావం పడకుండా బీజేపీ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతో ఓట్లు పడవేమో అనుకొని.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. బ్రిడ్జి ఘటనను కూడా సానుకూలంగా మార్చుకొని ఓట్లు రాబట్టుకునేందుకు.. కాంతిలాల్ అమృతియా అనే మాజీ ఎమ్మెల్యేకు ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ కేటాయించింది. ఈ నిర్ణ‌యం పార్టీ వ‌ర్గాల‌లో సంచ‌ల‌నం రేపింది. కారణం.. సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేశ్ మెర్జాను పక్కనబెట్టి కాంతిలాల్‌వైపు అధిష్టానం మొగ్గుచూపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మోర్బీ తీగల వంతెన కూలిన సమయంలో.. నదిలో పడిపోయిన వారిని కాపాడేందుకు కాంతిలాల్ ప్రయత్నించారు. లైఫ్ జాకెట్ ధరించి నదిలోకి దూకి పలువురిని రక్షించారు.

60 ఏండ్ల వయస్సులో కాంతిలాల్ అమృతియా చేసిన సాహ‌సానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ విస్తు పోయార‌ని, ఈ మేర‌కు ఆయన గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఈ ఘటన ఆధారంగానే బీజేపీ కేంద్ర పార్ల‌మెంట్ ఎన్నిక‌ల క‌మిటీ కీల‌క స‌మావేశంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జి కూలిన సమయంలో కాంతిలాల్ పలువురిని రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

గుజరాత్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబరు 1న తొలి దశలో 89 నియోజకవర్గాలు, డిసెంబరు 5న రెండో దశలో 93 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలను డిసెంబరు 8న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు వెల్లడిస్తారు.