తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయని, భవిష్యత్తులో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ చాన్స్ మళ్లీ రాదని, పార్టీ శ్రేణులంతా కలసి ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో తొలి దశ యాత్ర ముగింపు సందర్భంగా తెలంగాణలో పర్యటించారు నడ్డా. ఈ సందర్భంగా గురువారం మహబూబ్నగర్లో నిర్వహించిన సమావేశంలో… దళిత బస్తీల్లోకి వెళ్లాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు. వారితో కలిసి భోజనం చేయాలన్నారు.
ఇక యువజన సంఘాలు, మహిళ సంఘాలతో తరుచూ కాంటాక్ట్ లో ఉండాలన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నానని కాకుండా.. పార్టీ పనిచేసే అవకాశం ఇచ్చిందన్న ఫీల్ తో కష్టపడాలన్నారు. పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న కొత్తవారిని ఆహ్వానించాలని, అడ్డుకోవద్దని సూచించారు. పార్టీలో తమకు దక్కుతున్న ప్రాధాన్యతను ఇతర నేతలతో పోల్చి చూసుకోవద్దని కూడా ఆయన తెలిపారు. ప్రతి నెలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రణాళికలు లేకుండా ఏ నేత పర్యటనలు కూడా వద్దని సూచించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా సాగాలని కోరారు. దేశంలోని అన్ని పార్టీలు కుటుంబ పార్టీలేనని, అందుకు భిన్నంగా ఉన్న ఏకైక పార్టీ బీజేపీనేనని నడ్డా తెలిపారు.