హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చ చేపట్టిన మహిళ గోస- బీజేపీ భరోసా దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సభలో డీకే అరుణ మాట్లాడారు. తెలంగాణలో మహిళలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తెలంగాణలో సర్వే ప్రకారం 15 శాతం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదు అని అన్నారు. స్వయంగా బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య మీడియా ముందుకు వచ్చి మరీ తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిందన్నారు. రాష్ట్రంలో మహిళలను సీఎం అణగదొక్కుతున్నారని ఫైర్ అయ్యారు అరుణ. సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్నచూపు ఉందన్నారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యేలు పని చేయనివ్వడం లేదని, మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. మహిళల ఆత్మ గౌరవం పెరిగేలా బీజేపీ కార్యక్రమాలు చేపడుతుందని అరుణ పేర్కొన్నారు.