ఊహాగానాలు నిజమయ్యాయి. గత కొంత కాలంగా ఏపీ బీజేపీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత కన్నాలక్ష్మీనారాయణ చివరికి పార్టీనీ వీడారు. గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. మోదీపై విశ్వాసం ఉన్నా.. రాష్ట్ర నాయకత్వంపై తనకు నమ్మకం లేకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు కన్నా అనుచరుల సమావేశంలో తెలిపారు.
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాక కన్నాలక్ష్మీనారాయణ స్పీడ్ తగ్గించారు. దానికి తోడు కన్నాకు నష్టం కలిగించే విధంగా ఆయన వెంట నడిచిన పలువురు మద్దతుదారులను సోము వీర్రాజు వచ్చాక పార్టీ పదవుల నుంచి తొలగించారని అసంతృప్తిగా ఉన్నారు. పవన్‌తో బీజేపీ కలిసి వెళ్లే అంశంపై రాష్ట్రనాయకత్వం విఫలమైందని బహిరంగగానే కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.
అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయన బీజేపీ లేదా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నాను కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అదే సమయంలో పలువురు టీడీపీ నేతలు కూడా కన్నాతో చర్చలు జరిపారు.