అమరావతికి జై కొట్టిన మరో బీజేపీ నేత.. సస్పెండ్ చేసిన సోము - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతికి జై కొట్టిన మరో బీజేపీ నేత.. సస్పెండ్ చేసిన సోము

August 10, 2020

ఏపీలో రాజధాని రగడ ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ, టీడీపీ నేతలు ఒకే రకమైన వాదనలు వినిపిస్తుండగా.. బీజేపీ మాత్రం ఏటూ తేల్చలేకపోతోంది. రాజధాని అమరావతిపై పార్టీలోని నేతల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడిన నేతలపై ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల అమరావతికి మద్దతుగా మాట్లాడిన ఓ బీజేపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా.. తాజాగా మరో నేతను కూడా సాగనంపారు. బీజేపీ విధానాలకు విరుద్ధంగా  వ్యాఖ్యలు చేశారంటూ పార్టీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణను  సస్పెండ్ చేశారు. 

పార్టీ విధానాలు పాటించకుండా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని వేటు వేశారు.  ఇటీవల వెలగపూడి గోపాలకృష్ణ రాజధాని రైతులకు మద్దతుగా మాట్లాడారు. అమరావతి కోసం 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు బీజేపీ మద్దతుగా నిలవలేకపోతోందని విమర్శలు చేశారు. అదే సమయంలో తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఈ వ్యవహారంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. 

దీంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇంతకీ బీజేపీ మూడు రాజధానులకు మద్దతుగా ఉందా లేదా అనేది ప్రజలను అయోమయంలో పడేస్తోంది. కాగా ఇటీవల డాక్టర్ ఓవీ రమణను కూడా పార్టీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.