BJP, TRS angry over delay in results
mictv telugu

ఫలితాల జాప్యంపై బీజేపీ, టీఆర్ఎస్ ఆగ్రహం

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్‌కు మెజార్టీ వచ్చిన రౌండ్లనే ప్రకటిస్తున్నారంటూ బీజేపీ అభ్యంతరాలు తెలుపుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు.

ఇక ఎన్నికల అధికారులపై బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను సీఈఓ అప్ డేట్ చేయట్లేదని ఆరోపించారు.
ఫలితాల వెల్లడిలో ఎన్నికల అధికారి తీరు అనుమానస్పదంగా ఉందని విమర్శించారు. కొన్ని రౌండ్లలో బీజేపీకి లీడ్ వచ్చినా ఫలితాలను వెల్లడించలేదని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే జరుగుతుందన్న బండి సంజయ్.. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఇటు టీఆర్ఎస్ కూడా ఫలితాల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు వివరాలు తెలపాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేసారు. రౌండ్‌ల వారీ ఫలితాల్లో జాప్యం జరగడంపై ఆయన ఆసంతృప్తి వ్యక్తం చేసారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారుల నుంచి లీకులు అందుతున్నాయన్న వార్తలపై ఈసీ స్పందించాలన్నారు.