బీజేపీ వర్సెస్ తృణమూల్ ... విద్యాసాగర్‌ను కూల్చిందెవరు? వీడియో ఏం చెబుతోంది? - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ వర్సెస్ తృణమూల్ … విద్యాసాగర్‌ను కూల్చిందెవరు? వీడియో ఏం చెబుతోంది?

May 16, 2019

సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ అల్లర్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. కోల్‌కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన హింసపై రామరావణ యుద్ధంలా మోదీమమతా యుద్ధం సాగుతోంది. పరస్పర ఆరోపణలతో ఇద్దరూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విగ్రహం స్థానంలో పేద్ద పంచలోహ విగ్రహాన్ని పున:ప్రతిష్టిస్తామని  మోదీ అంటున్నారు. ఆయన సాయం తమకు అక్కర్లేదేని, విద్యాసాగర్‌ను గౌరవించుకోవడం ఎలాగో తమకు తెలుసని మమత స్పష్టం చేస్తున్నారు.

ఇంతకూ విగ్రహాన్ని ఎవరు కూల్చారు? బీజేపీ వాళ్లు అని తృణమూల్ కాంగ్రెస్ కొన్ని ఆధారాలంటూ ఎన్నికల సంఘానికి వీడియోలు చూపింది. తమ దగ్గర మొత్తం 44 వీడియోలు ఉన్నాయని పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ చెబుతున్నారు. అయితే విగ్రహాన్ని ముక్కలు చేసింది తృణమూల్ కార్యకర్తలే అని ప్రధాని మోదీ ఢంకా బజాయిస్తున్నారు.

వీడియోలో..

విగ్రహాన్ని కూల్చినప్పుడు తీసిన వీడియోల్లో కొందరు వ్యక్తుల కసితీరా విగ్రహం ముక్కలను విసిరేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కాషాయరంగు చొక్కాలు ధరించారు. దాని ఆధారంగా కూల్చివేతకు పాల్పడింది బీజేపీ అని తృణమూల్ అంటోంది. అయితే వాళ్లు తమవాళ్లు కాదని, తృణమూల్ కార్యకర్తలో కాషాయదుస్తుల్లో వచ్చి వుండొచ్చని బీజేపీ చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఈసీ నివేదిక కోరండంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమిత్ షా ర్యాలీ సందర్భంగా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.