పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా ఐకమత్యంగా కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చారు అమిత్ షా. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో బీజేపీ కోర్ కమిటీ భేటీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలంతా అమిత్ షాకు వివరించగా, ప్రతిగా ఆయన నేతలకు రాజకీయ దిశానిర్దేశం చేశారు. కేంద్రంపై టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని, ముఖ్యంగా కేంద్రం ఏం చేయలేదన్న వాదనకు గట్టి కౌంటర్ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనని నేతలతో అమిత్షా అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలంతా పనిచేయాలని కోరారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు గురించి తెలుసుకున్న అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని చెప్పారు.