Bjp Worker Gunned Down At Showroom In Gurugram Sadar Bazaar In Haryana
mictv telugu

హర్యానా సీఎం సన్నిహితుడి కాల్చివేత.. బావమరిది చంపాడని ఫిర్యాదు

September 2, 2022

హర్యానాలో బీజేపీ నేత, ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సుఖ్‌బీర్‌ ఖతానాపై తూటాల వర్షం కురిపించారు. సుఖ్‌బీర్‌ ఖతానాను అందరూ సుఖిగా పిలుస్తారు. రితోజ్ గ్రామానికి చెందిన సుఖి నిన్న తన స్నేహితుడితో కలిసి గురుగ్రామ్ సదర్ బజార్ ప్రాంతంలోని ఓ క్లాత్ షోరూముకు వెళ్లారు. అక్కడే కాచుకుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గాయపడిన ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఆయన హత్య గురించి తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

సోహనా మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడైన సుఖ్‌బీర్‌ ఖతానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండగానే ఈ ఘటన జరిగింది. స్నేహితుడు రాజేందర్‌తో కలిసి కారులో గురుద్వారా రోడ్డులోని రేమండ్ షోరూమ్‌కు సుఖి వెళ్లగా మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన తర్వాత అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు క్లాత్ షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. సుఖి బావమరిది చమన్ తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు సుఖి కుమారుడు అనురాగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.