అమిత్‌‌షాతో ప్రశాంత్ భేటీ అయ్యారని వార్తలు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్‌‌షాతో ప్రశాంత్ భేటీ అయ్యారని వార్తలు..

March 17, 2018

ప్రత్యేక హోదా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖచిత్రాన్ని గుర్తించడానికి వీల్లేకుండా సమూలంగా మార్చేస్తోంది. ఎత్తుకు పైఎత్తులతో పార్టీలు బిజీగా ఉన్నాయి. సంచలనాలకు తెరతీస్తున్నాయి. శనివారం సాయంత్రం వైకాపా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి.  భేటీకి ఏపీ బీజేపీ నేతలు హరిబాబు, ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార తదితరులు కూడా హాజరయ్యారు. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైకాపా ఇప్పుడు ఆ పార్టీతో చేయి కలపబోతోందన్న వార్తలు రాజకీయ పరిశీలకులనే నివ్వెరపరుస్తున్నాయి.

హరిబాబుకు కేంద్రమంత్రి పదవి..

ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా టీడీపీ కేంద్ర కేబినెట్ నుంచి బయటి రావడం తెలిసిందే. అంతకు ముందు, కేంద్ర మంత్రి పదవులకు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు రాజీనామా చేశారు. దీంతో టీడీపీ, బీజేపీల బంధం పూర్తిగా తెగిపోయింది. బీజేపీని బలోపేతం చేసుకోవడం భాగంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ ఎంపీ హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి కల్పించే అవకాశపై అమిత్ షా చర్చించినట్లు తెలుస్తోంది. హరిబాబును కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే  రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికిస్తే బావుటుందో కసరత్తు చేశారు.

బీజేపీ తనకు వ్యతిరేకంగా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్‌లను ఉసిగొల్పుతోందని చంద్రబాబు ఆరోపించడం తెలసిందే. వైకాపా గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్న ప్రశాంత్ కిశోర్‌కు ఏపీ పరిస్థితిపై సరైన అంచనా ఉంటుందని అమిత్ షా భావించారని, అందుకే ఢిల్లీకి పిలిపించుకున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే వైకాపా వీటిని ఇంకా ధ్రువీకరించలేదు. కిశోర్.. గతంలో బీజేపీ కోసం కూడా పనిచేశారు. కొన్ని రోజుల కింద వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా అమిత్ షా, మోదీల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. ఇదంతా పొత్తు కుదుర్చుకోవడానికి చేస్తున్న కసరత్తు అని టీడీపీ ఆరోపించింది. పొత్తు ధర్మంలో భాగంగా జగన్ కు సీబీఐ కేసుల నుంచి బీజేపీ విముక్తి కల్పిస్తుందని వార్తలు వస్తున్నాయి. త్రిపుర ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే బీజేపీ ఏపీలోనూ అనుసరిస్తోందన్న రెండు మూడురోజులగా వార్తలు వస్తున్నాయి. ఫిరాయింపులను ప్రోత్సహించడం, కొత్త పొత్తులు పెట్టుకోవడం తదితరాల ద్వారా త్రిపులో కాషాయ జెండా ఎగిరింది.