మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్..సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్..సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం

November 23, 2019

మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి. రాత్రికి రాత్రే పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణాస్వీకారం చేశారు. శివసేనకు ఎన్సీపీ షాక్ ఇస్తూ బీజేపీకి జై కొట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజ్‌భవన్‌లో ఉదయం 8 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. రెండు పార్టీలు తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో గవర్నర్ వారిని ఆహ్వానించారు. 

ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ ప్రమాణం చేశారు. నిన్నటి వరకూ శివసేనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన ఎన్సీపీ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చింది. చాలా రోజుల పాటు చర్చోప చర్చల అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాయి. ఒక్కసారిగా మారిన ఈ రాజకీయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. త్వరలోనే మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసేందుకు బీజేపీ – ఎన్సీపీ సిద్ధమౌతున్నాయి. 

ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తమ ప్రభుత్వంపై ధీమా వ్యక్తం చేశారు. సుస్థిర పాలనను అందిస్తామని వెల్లడించారు. అసెంబ్లీలో తమకు పూర్తి మెజార్టీ ఉందన్నారు. అవగాహనతో ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు తమను స్వాగతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీకి ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.