టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ లీకేజ్ ఘటనలో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో.. మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ రిక్రూట్‌మెంట్ ఆపేందుకే బీజేపీ ఈ కుట్ర చేసిందన్న ఆరోపణలు తాజాగా వెల్లువత్తుతున్నాయి. అందుకు ప్రధాన కారణం TSPSC పేపర్ లీక్ లో A2గా ఉన్న ముఖ్య నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని తెలుస్తోంది. నిందితుడు బీజేపీలో క్రియాశీలక కార్యకర్త అని దర్యాప్తు బృందం గుర్తించింది. దీంతో ఈ పేపర్ లీక్ ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా విచారణ చేపట్టారు అధికారులు.
వరుస రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లతో యువత బీజేపీకి దూరం అవుతుందని ఈ మధ్యే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్ మెంట్ ఆపేందుకు బీజేపీ కుట్ర పన్నిందా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. బీజేపీ తెర ముందు ఒకలా, తెర వెనుక మరోలా డబుల్ గేమ్ ఆడుతుందా అన్న అనుమానాలు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ వెనక పెద్ద కుట్రేదాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… అంతకుముందు వరుస నోటిఫికేషన్ల కారణంగా యువత తమ పార్టీకి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు నెలలపాటు చదువులు, ఉద్యోగాలు మానేసి తన వెంట తిరగాలని బహిరంగంగా యువతకు ‘హితబోధ’ చేసిన సంజయ్.. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి అన్ని ప్రశ్నప్రతాలు లీక్ అయ్యాయని, యువత తమ సమయాన్ని వృథా చేసుకున్నట్లయిందని మీడియా ముందు ఆవేదన చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశాడని , దానికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ గురించి బండి ప్రస్తావించడం ఏదో సానుభూతి కోసం ప్రయత్నించినట్లు కొందరు విమర్శిస్తున్నారు. రానున్న రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాప్రతాలకు సంబంధించిన సమాచారం కేసీఆర్ దగ్గరే ఉందని బండి సంజయ్ చెప్పాడంటే ఈ విషయాలన్ని అతనికెలా తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఈ నే పథ్యంలోనే పేపర్ లీక్ ఘటనలో బీజేపీ కుట్ర కోణం ఉందన్న వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నిజంగానే కుట్ర చేసి రిక్రూట్ మెంట్ ఆపడానికి కుట్ర చేసినట్లయితే…పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.