బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న ఆయన రాజ్యసభ సభ్యత్వం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించారు. కేబినెట్‌కు రాజీనామా చేసిన వెంటనే, నఖ్వీ రాజధాని నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.
రాజ్యసభలో ఎంతో అనుభవం ఉన్న నఖ్వీని .. బీజేపీ మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయకుండా, ఉపరాష్ట్రపతిని చేసే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండటం, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలకు గతవారం నోటిఫికేషన్ విడుదలవడం.. ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఆ ఎన్నికలకు నామినేషన్లు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో మైనారిటీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను… ఉపరాష్ట్రపతిని చేయాలని బీజేపీ భావిస్తోంది. దశాబ్దాలుగా బీజేపీలో పలు హోదాల్లో నఖ్వీ ఆపార్టీకి సేవలందించారు. పార్టీకి అత్యంత విశ్వసనీయమైన మైనారిటీ నేతగా నఖ్వీ.. పార్టీ పెద్దల మన్ననలు పొందారు.