BL Santosh has been included in the list of accused in the MLA purchase case
mictv telugu

ఎమ్మెల్యేల ఎర కేసు.. నిందితుల జాబితాలో ‘ఆ నలుగురు’

November 25, 2022

BL Santosh has been included in the list of accused in the MLA purchase case

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫాంహౌస్ లో ఆడియో, వీడియో ఆధారంగా పట్టుబడ్డ ముగ్గురు నిందితులు ఇప్పటికే ఏ1, ఏ2, ఏ3 లుగా సిట్ చేర్చింది. వీరితో పాటు ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఏ4, తుషార్ వెళ్లపల్లి ఏ5, జగ్గుస్వామి ఏ6, కరీంనగర్ కి చెందిన న్యాయవాది శ్రీనివాస్ ఏ7 లుగా సిట్ ఎఫ్ఐఆర్ జాబితాలో చేర్చింది. ఈ మేరకు సిట్ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.

దీంతో బీజేపీకి ఉచ్చు బిగిసినట్టయింది. కొత్తగా నిందితుల జాబితాలో చేర్చిన మొదటి ముగ్గురికి ఇప్పటికే 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. కేరళలో జరిగిన సోదాల్లో తుషార్, జగ్గుస్వామి అందుబాటులోకి రాకపోవడంతో వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక బీఎల్ సంతోష్ ని ఈ నెల 26 లేదా 28న విచారణకు హాజరుకావాలని సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. అటు అంబర్ పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్ ను ఈ నెల 25న హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్ చేయకుండా సిట్ కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్ రిట్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దానిని కొట్టివేస్తూ సిట్ జారీ చేసిన నోటీసుల మేరకు శుక్రవారం దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. ఒకవేళ ప్రతాప్ నోటీసుల ప్రకారం విచారణకు సహకరించకపోతే సిట్ కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

బీఎల్ సంతోష్ తో బీజేపీకి చిక్కులేనా?

ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సిట్ అందరితో పాటు సంతోష్ కి కూడా నోటీసులు పంపుతున్నా.. ఆయన వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావట్లేదు. బీజేపీ కూడా సంతోష్ గురించే ఎక్కువ టెన్షన్ పడుతోంది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ సంతోష్ పేరు తలచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ప్రచారక్ అని రాజకీయాలు, పదవులు వంటి వాటితో సంబంధం ఉండదని భావోద్వేగానికి గురయ్యారు. అటు ఇప్పటికే సిట్ రెండు సార్లు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు పంపినా స్పందించకపోవడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేసుతో సంబంధం లేకుంటే ఆ విషయమే సిట్ కు స్పష్టంగా తెలియజేయాలని సూచించింది.

అరెస్ట్ చేస్తారనే భయంతో రావట్లదేనే అంశం చర్చకు రాగా, అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన తీర్పును కోర్టు పునరుద్ఘాటించింది. అలాంటప్పుడు భయపడడం ఎందుకని ప్రశ్నించింది. ఈ సారి నోటీసులను ఆయన మెయిల్ తో పాటు వ్యక్తిగత ఫోన్ నెంబరుకి వాట్సాప్ ద్వారా పంపాలని అభిప్రాయపడింది. సంతోష్ తరపున రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, పిటిషనర్ ప్రేమేందర్ రెడ్డి వాదనలు వినిపించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందును సిట్ ఎదుట హాజరుకాలేకపోతున్నట్టు సంతోష్ లేఖ రాశారని చెప్పారు. అటు సిట్ కు సహకరించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారని కేంద్రం తరపున డిప్యూటీ ఎస్జీ ప్రవీణ్ కుమార్ కోర్టుకు చెప్పారు. సంతోష్ ఢిల్లీలో లేనందున కోర్టు ఆదేశాల మేరకు సిట్ నోటీసులను ఢిల్లీ బీజేపీ కార్యాలయంలోని హేమేందర్ అనే వ్యక్తికి అందించారని తెలియజేశారు.