కొమ్రయ్య, కొమ్రమ్మ చావుకు కారణం ఎవరు ? - MicTv.in - Telugu News
mictv telugu

కొమ్రయ్య, కొమ్రమ్మ చావుకు కారణం ఎవరు ?

July 10, 2017

4G సూపర్ ఫాస్ట్ కాలంలో వుండి కూడా ఇంకా మంత్రాలు, భానవతులేందిరా నాయనా ? మనం ముందుకు ఉరుకుతున్నట్టే వెనకకు కూడా అంతే వేగంగా తిరోగమనం చేస్తున్నట్టే లేదూ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం గంగిరెద్దుల కాలనీలో పాపం ఒకే కుటుంబంలోని ఐదుగురు తనవు చాలించారు. ముగ్గురు పిల్లలకు ఉరి వేసి ఆ తల్లిదండ్రులు కూడా ఉరి వేస్కొని ప్రాణాలు తీస్కున్నారు. దీనికి కారణం? మానవత్వం మరిచిన మనుషుల రాక్షస స్వభావమా ? మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఘంటా కొమ్రయ్య, కొమ్రమ్మ దంపతులను హుస్నాబాదు పిలిపించి దాడి చేయటమే కాకుండా, వారిని సభ్య సమాజం ముందు మంత్రగాళ్ళుగా ముద్ర వేసారు.

ఇది భరించలేని ఆ యువజంట తమ మానాలను కాపాడుకోవాలంటే ప్రాణాలు తీస్కోవడమే ఏకైక మార్గంగా భావించినట్టున్నారు పాపం.. మాకు భానవతి రాదు, మంత్రాలు రావు అని ఎంత మొత్తుకున్నా వాళ్లు వినలేదు. వాళ్ళని వాళ్ళు ఉత్తములుగా నిరూపించుకోవాలంటే మరణమే మార్గమని భావించినట్టున్నారు. అయితే మంత్రగాళ్ళుగా మరణిస్తే పాపం ఆ పిల్లలకు కూడా చుట్టుకుంటుందని కాబోలు ఆ పిల్లలను కూడా తమ వెంట తీస్కెళ్ళిపోయారు. సమాజంలో పెరుగుతున్న వికృత చేష్టలకు కొమ్రయ్య, కొమ్రమ్మలు సజీవ సాక్ష్యాలు.

అవమానాన్ని తట్టుకోలేక ఇంటిల్లిపాది అందరూ ఉరి వేస్కొని బలయ్యారు ?? ఇద్దరు ఆలుమగలు, ముగ్గురు ఆడబిడ్డలు అన్యాయంగా అనుమానపు విషపుకోరలకు బలయ్యారు. ఇంకా మనం ఎక్కడున్నాం ? సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించిన ఈ వ్యవస్థ ఎప్పటికీ మారదా ? ఈ దాడి చేసిందెవరు ? చేయించిందెవరు ? దీనికోసం పెద్దగా అన్వేషించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సమాజంలో మనిషి మనిషిని నమ్మకుండా అతీతమైన చర్యలేవో వున్నాయని నమ్మే మనలో ప్రతీ ఒక్కరు కొమ్రయ్య, కొమ్రమ్మల చావులకు కారణం. దయ్యం, భూతం అనే వేదాంతాన్ని నమ్మేవారంతా వారి మరణానికి కారకులన్నట్టే.

ఇది సమాజమంతా సిగ్గుతో తల దించుకోవాల్సిన సమయం. ఒకవైపు అధునాతన టెక్నాలజీని నిత్యం జీవితంలో భాగం చేస్కుంటున్న మనం ఇంకా మూఢ నమ్మకాలతో బతుకుతున్నామంటే అసహ్యంగా లేదు ? వాళ్ళకు మంత్రాలు వస్తాయనేది నిజమే అయితే దాడి చేసినవాళ్ళ మీద ప్రతిదాడి చేస్తారు కదా మంత్రాలతోటే.. గుడ్డిగా నమ్మి అణ్యం పుణ్యం ఎరుగని వారి ప్రాణాలను బలిగొన్న నిజమైన రాక్షసులు, మంత్రగాళ్ళు ఈ సమాజం నిండా వున్నారా ? ఎందుకిలా చేసారు ? వీళ్ళు మారరా ? ఇంకా ముందు ముందు ఇంకెందరి ప్రాణాలను ఈ మూఢ నమ్మకాలకు బలి చేస్తారు. వెన్నుముక లేని సమాజం ఎప్పుడూ పక్కోడి పక్కన బల్లెమే అని రుజవు అవుతోంది ? విచక్షణను కోల్పోతున్న ఈ మనుషుల మధ్య సామాన్యుడు బతకడం గగనమైపోతోంది ?? తోటి మనిషి మీద ఏదో ఒక నింద మోపి ఇలా ప్రాణాలు తియ్యాలంటే సమాజంలో ఎవ్వరు కూడా మిగలరు కావచ్చు.