తాను దివాలా తీసినట్లు, నికర విలువ సున్నాకు చేరుకున్నట్లు ఫిబ్రవరి 2020 లో UK కోర్టుకు ప్రకటించిన రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడు. అనిల్ అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో దాచిన రూ.800 కోట్ల నల్లధనం గుట్టు రట్టయింది. విదేశాలలో రూ. 800 కోట్ల పెట్టుబడి ట్రాన్సాక్షన్ల వివరాలు ఇవ్వడంలో ఆయన విఫలమవడంతో బ్లాక్ మనీ యాక్ట్ (బీఎంఏ) కింద ఆదాయపు పన్ను శాఖ ఒక ఆర్డరు జారీ చేసింది.
బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లలో పెట్టిన కంపెనీల బెనిఫిషియల్ ఓనర్షిప్ ఎవరిదని ఐటీ డిపార్ట్మెంట్ ప్రశ్నించింది. బహమాస్‌లో 2006లో డైమండ్ ట్రస్ట్‌ను అనిల్ అంబానీ ఏర్పాటు చేశారు. దీనిని డ్రీమ్ వర్క్ హోల్డింగ్స్ ఇంక్ లింకుతో నెలకొల్పారు. ఈ కంపెనీకి స్విస్ బ్యాంకు అకౌంటు (యూబీఎస్కి చెందిన జురిస్ బ్రాంచ్)తో లింకు ఉందని తేలింది. ఇక బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లో 2010లో మరో ఆఫ్‌షోర్ కంపెనీ నార్త్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్లిమిటెడ్ పేరుతోనూ ఆయన తెరిచారు. బ్యాంక్ ఆఫ్ సైప్రస్‌లో ఈ కంపెనీకి అకౌంటు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు డొల్ల కంపెనీల వివరాలూ ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు తెలిసిపోయాయి. దీంతో ఈ నిధుల వివరాలు సమర్పించాలని ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ.. అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. విదేశీ కంపెనీకి అప్పులు కట్టలేకపోయిన అనిల్ అంబానీ యూకేలోని ఒక కోర్టులో తాను దివాలా తీసినట్లు ప్రకటించుకున్నారు. లీగల్ ఖర్చుల కోసం ఆభరణాలను సైతం అమ్ముకున్నానని అనిల్ అంబానీ కోర్టుకు చెప్పారు.