Black money allegations on Kalvakuntla Kavitha; Bakka Judson complained to ED and CBI.
mictv telugu

బ్లాక్ మనీతో ‘లైగర్’ నిర్మాణం.. ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు!

September 6, 2022

విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాగా వచ్చి ఫ్లాప్ అయిన ‘లైగర్’ సినిమాకు ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు జడ్సన్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన దగ్గరున్న బ్లాక్‌ మనీని వైట్ చేసుకునేందుకు కవిత లైగర్ సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టిందన్నారు. హిట్లు లేక సతమతమవుతున్న విజయ్, పూరీ జగన్నాథ్‌ సినిమాకు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టే ధైర్యం ఎవరికి ఉందని ప్రశ్నించారు. ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌తో పాటు భారీ తారాగణం ఉన్నారని, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని భారీగా నిర్మించారని వెల్లడించారు.

‘ఇటీవల కల్వకుంట్ల కవిత తెలుగులోని టాప్ ప్రొడ్యూసర్లతో ఓ మీటింగ్ పెట్టి విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఆదేశాలు ఇచ్చిందా? లేదా?’ అని ప్రశ్నించారు జడ్సన్. ‘ఇటీవల విజయ్ దేవరకొండను కవిత తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడింది. తన దగ్గరున్న బ్లాక్‌ మనీని వైట్ చేసుకునేందుకు కవిత లైగర్ సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది కేవలం మా ఆరోపణ కాదు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశాం. ఇదొక్కటే కాదు. 2017లో డ్రగ్స్ కేసులో పలువురు సినీ సెలబ్రెటీలను పిలిచి విచారించారు. ఇందులో చాలామంది సెలబ్రెటీలతో పాటు పూరీ జగన్నాథ్, ఛార్మి కూడా ఉన్నారు. కొంతకాలానికి వీరందరికి క్లీన్ చిట్ వచ్చింది. అక్కడి నుంచి పూరీ, ఛార్మీకి కవితతో అనుబంధం పెరిగింది. తన దగ్గరున్న బ్లాక్‌మనీతో కవిత వీరితో సినిమాలు తీస్తోంది. అందుకే లైగర్ ఫ్లాప్ అయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని జడ్సన్ ఆరోపించారు.