జార్జిరెడ్డి బ్లేడ్ సీన్లు కేక.. వాటి కోసం ప్రత్యేక శిక్షణ.. - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి బ్లేడ్ సీన్లు కేక.. వాటి కోసం ప్రత్యేక శిక్షణ..

November 22, 2019

Blade Fight in George Reddy.. Hero special training ...

గతించిన చరిత్రను ఒడిసిపట్టి ఇప్పటి తరానికి అర్థమయ్యేలా సినిమా తీయడం కత్తి మీద సామే. పైగా అప్పటి పరిస్థితులు, మనుషులు ఎలా ఉన్నా ఇప్పుడున్నవారి మనోభావాలు నొచ్చుకోకుండా సినిమా తీయడం ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ విషయంలో జార్జిరెడ్డి’ బయోపిక్ సఫలీకృతం అయింది. 

ఇవాళ విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. చక్కని స్క్రీన్‌ప్లేతో ఈ జెనరేషన్‌కి అర్థమయ్యేలా సినిమా తీశారని మెచ్చుకుంటున్నారు. హీరో సందీప్ మాధవ్ జార్జిరెడ్డి పాత్రకు సరిగ్గా సరిపోయాడని అంటున్నారు. వివిధ పాత్రల  బట్టలు, వారి హెయిర్ స్టైల్, హావాభావాలు, మాట్లాడే తీరు ఇలా ప్రతీ విషయంలో దర్శకుడు జీవన్ రెడ్డి బాగా శ్రద్ధ పెట్టారు. 

ముఖ్యంగా హీరో బ్లేడ్‌లతో చేసిన ఫైట్లు చాలా కొత్తగా, వింతగా అనిపించాయని ప్రేక్షకులు థియేటర్‌లోనే ఈలలు వేస్తున్నారు. చేతి రుమాలుకి జార్జిరెడ్డి బ్లేడ్‌లు కట్టి దాంతో పోరాడటం ఆకట్టుకుంటుంది. నోట్లో బ్లేడ్లు పెట్టుకుని..  పిప్పరెమెంటులా లోపలికీ బయటికీ తిప్పటం కూడా ఆకట్టుకుంటుంది. ఇదంతా గ్రాఫిక్సా లేకపోతే హీరో నిజంగానే చేశాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే అది నిజమేనని.. ఇందుకోసం హీరో సందీప్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. 

జార్జిరెడ్డి కూడా బ్లేడ్‌లతో సావాసం చేశాడు కాబట్టే దానిని మేము ఈ సినిమాలో పెట్టాం అని తెలిపారు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. పైగా సందీప్ కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడని చెప్పారు. ఇలా హీరోలోని స్పెషల్ క్వాలిటీలు అయిన బుల్లెట్ నడపడం, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, పుస్తకాలు చదవడం, రాజకీయాలు, సామాజిక అంశాలపై పట్టు ఉండటం, సమాజాన్ని ప్రేమించడం వంటి అనేక లక్షణాలు ఇప్పటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రేక్షకులు అంటున్నారు.