గోల్కొండ కోటలో భారీదోపిడీ.. ఆకలి కేకలు, దూప - MicTv.in - Telugu News
mictv telugu

గోల్కొండ కోటలో భారీదోపిడీ.. ఆకలి కేకలు, దూప

October 14, 2018

హైదరాబాద్ తలపై మణిహారం గోల్కొండ. ఆ చారిత్రక దుర్గాన్ని చూడ్డానికి వెళ్లే వారికి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనల పేరుతో సందర్శకుల జేబులను గుళ్ల చేస్తున్నారు అధికారులు, వ్యాపారులు. దీంతో సామాన్య జనం, ముఖ్యంగా పిల్లలు ఆకలికేకలతో కోటలో తిండో రామచంద్రా, నీళ్లోలక్ష్మణా అని అలమటిస్తున్నారు.

yy

సందర్శకులు కోటలో తినడానికి ఇళ్ల నుంచి తెచ్చుకునే తిండిని, నీళ్ల బాటిళ్లను అక్కడిని తనిఖీ సిబ్బంది అనుమతించడం లేదు. వాటిని బయట ఎక్కడైనా పెట్టుకోండని, కోటలోకి మాత్రం తీసుకుపోవద్దని ఆదేశిస్తున్నారు. దీంతో సందర్శకులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. పోనీ లాకర్లలో పెడతామా అంటే అక్కడ ఆ సౌకర్యమూ లేదు. దీంతో కొందరు బయటే తినేసి లోపలికి వెళ్తున్నారు. కొందరు పడేసి పోతున్నారు. కోట లోపలి ఆహార ధరలు భారీగా ఉన్నాయని, సందర్శకుల ఆహారాన్ని లోపలికి అనుమతిస్తే దోపిడీ కష్టమని నిర్వాహకులు భావించినట్లు సమాచారం. దీనికి తోడు సెక్యూరిటీ నిబంధనల పేరుతో బయటి నుంచి తిండీతిప్పలను అనుమతించకుండా పక్క పథకంలో లూటీ చేస్తున్నారని సందర్శకులు ఆరోపిస్తున్నారు.

తోటలో కూడా కూర్చోవద్దంట..

కోటలోని ప్రధాన ద్వారం వద్ద ఉన్న తోటలో ఇదివరకు సందర్శకులు కూర్చుని సేదతీరేవారు. అయితే నెల కిందట తెచ్చిన నిబంధనల కారణంగా అక్కడ కూర్చోడానికి అనుమతించడం లేదు. దీంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కోటలో ఒకటే వీల్ చైర్ ఉండడంతో వయో వృద్ధుల కాళ్లీడ్చుకుంటూ తిరుగుతున్నారు. లేకపోతే కూలబడిపోతున్నారు. అధికారులు ఈ ఇబ్బందులను పరిష్కరించాలని సందర్శకులు కోరతున్నారు.