చలికాలం వచ్చిందంటే చాలు..ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్తప్రసరణకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ కాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు, ఆక్సిజన్‌ను పంప్ చేసేందుకు మన గుండె చాలా కష్టపడుతుంది. చల్లని వాతావరణం ధమనుల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో రక్తంగడ్డకట్టే ఛాన్స్ పెరుగుతుంది. దీంతో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు జలుబు, దగ్గు వంటి సీజనల్ ఫ్లూలతోపాటు ఊపిరితిత్తుల సమస్య కూడా తీవ్రతరం అవుతుంది. కాబట్టి చలికాలంలో మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.
1. రోజూ వ్యాయామం చేయాలి:
చలికి భయపడి దుప్పట్లు కప్పుకునే వాళ్లు చాలా ఉంటారు. కానీ శరీరానికి చలికాలంలోనూ వ్యాయామం చాలా అవసరం. శారీరక శ్రమ మీ గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజువారీ వ్యాయామం మీ రక్తాన్ని ప్రవహించేలా చేస్తుంది. నడక, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయడానికి ప్రయత్నించండి.
2. ఉప్పు ఎక్కువగా తినకూడదు.
చలికాలంలో ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. గింజలు, పండులు, కూరగాయలు,తృణధాన్యాలు వంటి విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారం తినాలి. దానిమ్మ పండ్లు, వెల్లుల్లి, చేపలు ఇలాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. అంతేకాదు అధిక ప్రాసెస్ చేసిన ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు.
3. హై షుగర్ డైట్ కు దూరంగా :
ఈ వింటర్ సీజన్లో హై షుగర్ డైట్ కు దూరంగా ఉండాలి. చాలామంది స్వీట్లు తినేందుకు ఇష్టపడుతుంటారు. ఎక్కువ చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. కాబట్టి చలికాలంలో స్వీట్లకు దూరంగా ఉండాలి.
4. మద్యపానం, ధూమపానం :
మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. వీటిని ఈ ఏకాలంలోనూ తీసుకోకూడదు. ఈ చలికాలంలో వీటితో మరింత హానికలుగుతుంది. ఎందుకంటే చలికి వెచ్చగా ఉండేందుకు రమ్, విస్కీ, జిన్ ఎక్కువగా సేవిస్తారు. వీటితోపాటు సిగరెట్లు ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఈ అలవాట్లు మీ రక్తాన్ని ప్రసరించే మీ శరీర సామర్థ్యాన్ని నెమ్మది చేస్తుంది. దీంతో రక్తప్రసరణ తగ్గుతుంది. రక్తనాళాలు ఇరుకుగా మారి అధిక రక్తపోటుకు దారితీస్తుంది.