బోధన్ అల్లర్లు.. చైర్‌పర్సన్ భర్త పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

బోధన్ అల్లర్లు.. చైర్‌పర్సన్ భర్త పరార్

March 24, 2022

bfbfb

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన అల్లర్లు ఎంత కలకలం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటికొస్తున్నాయి. గురువారం తమ విచారణలో బోధన్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మా భర్త, 35 వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్‌ శరత్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా శరత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ కేసులో తన పేరు వెలుగులోకి వచ్చిందని శరత్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు.

మరోపక్క వివాదానికి కారణమైన శివాజీ విగ్రహాన్ని శరత్ రెడ్డి మహారాష్ట్రలోని నాందేడ్‌లో తయారు చేయించి, 15 రోజుల క్రితం బోధన్‌కు తీసుకువచ్చి తన రైస్ మిల్లులో దాచడంతో పోలీసులు గుర్తించారు. శరత్‌రెడ్డి ఆ విగ్రహాన్ని శివసేన జిల్లా ప్రెసిడెంట్ గోపీకిషన్‌‌కి అప్పగించి, గుట్టు చప్పుడు కాకుండా అంబేద్కర్ సెంటర్లో విగ్రహాన్ని పెట్టాలని ఆదేశించాడు. వీరిద్దరూ పక్కా ప్లాన్‌తో ఆ విగ్రహాన్ని రాత్రివేత సెంటర్‌కు తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న గోపి కిషన్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మరోవైపు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంబేద్కర్ సెంటర్‌తో పాటు, పలు ప్రధాన సర్కిళ్ల వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేశారు.