టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్! కేసు భయంతోనేనా?  - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్! కేసు భయంతోనేనా? 

September 12, 2019

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అనగానే మొదట గుర్తుకొచ్చేది. టీడీపీ, కాంగ్రెస్ నేతలే. ఎప్పుడో అధికారం కోల్పోయి ఉనికి కోసం పాకులాడుతున్న ఆ పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధమైంది!  గులాబీ పార్టీలో ఏకైక ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే అయిన బోధన ఎమ్మెల్యే షకీల్.. కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. 

మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో షకీల్ బీజేపీవైపు చూస్తున్నట్లు సమాచారం. ఆయన గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ కావడంతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సన్నిహితుడైన షకీల్ ఏకంగానే పార్టీనే మారతారని ప్రచారం సాగడంతో కలకలం రేగుతోంది. మంత్రి పదవే కాకుండా కీలక నామినేటెడ్ పోస్టులు సైతం తనకు రావనే నిరాశతోనే ఆయన కమలంవైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీలో ఏకైక మైనారిటీ ఎమ్మెల్యేనైన తనకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని, పైగా ఎంఐఎం నేతలకు పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని షకీల్ కినుక వహించినట్లు చెబుతున్నారు. ‘టీఆర్ఎస్‌లో కష్టపడేవారికి గుర్తింపు లేదు. పార్టీలో ఇమడలేకపోతున్నాను.  రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కొందరు కేసీఆర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు పూర్తి వివరాలను సోమవారం వెల్లడిస్తాను..’ అని ఆయన తమ విలేకరితో చెప్పినట్లు టీవీ9 చానల్ తెలిపింది. అయితే  షకీల్ టీఆర్ఎస్ పార్టీ మారే ప్రసక్తే లేదని, మంత్రి పదవి కోసం కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా పావులు కదుపుతుండొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.

షకీల్‌పై గతంలో మానవ అక్రమ రవాణా కేసు ఒకటి నమోదైంది. ఈ కేసులో భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వస్తే బీజేపీ ఆదుకుంటుందన్న ఆలోచనతోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవచ్చని చెబుతున్నారు. అయితే దీనిపై అటు షకీల్ కానీ, ఇటు బీజేపీ, టీఆర్ఎస్‌ల నుంచి గానీ ఎలాంటి ప్రకటనా రాలేదు.