ఏపీలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. హత్య చేశారా?.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. హత్య చేశారా?..

May 20, 2022

ఆంధ్రప్రదేశ్‌లో ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కారులో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి, అతని తల్లిదండ్రులకు అప్పగించడంతో తమ కొడుకును హత్య చేశారని అతని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ కారులో ఓ యువకుడి మృతదేహం బయటపడింది. మృతి చెందిన ఆ యువకుడు.. ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రమణ్యంగా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి ఉదయ్‌ భాస్కర్‌ తనతోపాటు సుబ్రమణ్యంను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతిచెందాడని, డ్రైవర్‌ తమ్ముడికి సమాచారం అందించారు.

అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు అతని మృతదేహాన్ని ఎమ్మెల్సీ తన కారులో తీసుకొచ్చి, అతని తల్లిదండ్రులకు అప్పగించి, అనంతబాబు కారును అక్కడే వదిలి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. సుబ్రమణ్యంను హత్య చేశారని తల్లిదండ్రులు, బంధువులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. హత్య చేశారా? లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.