చనిపోయాడని చెబితే నమ్మలేదని..  సమాధి తవ్వి.. శవాన్ని ఆఫీసుకు తీసుకెళ్లారు.. - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోయాడని చెబితే నమ్మలేదని..  సమాధి తవ్వి.. శవాన్ని ఆఫీసుకు తీసుకెళ్లారు..

November 22, 2019

Body of evidence

‘బీమా చేసుకోండి.. మీ జీవితం ముందు, తర్వాత భద్రత పొందండి’ అంటూ జీవిత బీమా కంపెనీల ఏజెంట్లు వెంటపడిమరీ పాలసీలు చేస్తుంటారు. టర్మ్ ప్రకారం డబ్బులు బాగానే వసూలు చేస్తారు. బీమా చేయడం వరకే వాళ్లు పట్టించుకుంటారు. ఆ తర్వాత వాళ్లు పత్తా ఉండరు. పోనీలే.. భద్రతలేని జీవితానికి ఆ బీమా ఉంటేనైనా తాము అర్థాంతరంగా పోతే తనమీద ఆధారపడ్డవాళ్లకు ఆ డబ్బులు పనికొస్తాయని భావిస్తారు. కానీ, వాళ్లు పోయాక ఆ వింతలు వాళ్లే చూడరు. బీమాతో అలాంటి ఓ చేదు అనుభవం ఓ కుటుంబానికి ఎదురైంది. చనిపోయాడని చెప్పినా ఆ సంస్థ బీమాను ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో వాళ్లు ఏకంగా పూడ్చిపెట్టిన శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి ఆ సంస్థ ఆఫీసుకి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటన చాలామందిని కదిలిస్తోంది. 

 

నవంబర్ 7న దక్షిణాఫ్రికాలోని సిఫిసో జస్టిస్ మొలాంగో(46) అనే వ్యక్తి చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు నొంబెన్‌లే మొలాంగో, దందాజ్ మష్లీలు బీమా సంస్థకు ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఆధారాలు కావాలని, ఇందుకోసం కొన్నిరోజులు వేచి చూడాలని సదరు బీమా సంస్థ అధికారులు చెప్పారు. నవంబరు 7న మొలాంగోకు అంత్యక్రియలు ముగించి, 11వ తేదీన ‘ఓల్డ్ మ్యూట్యాల్స్’ సంస్థలో బీమా మొత్తాన్ని పొందేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇందుకు 48 గంటలు పడుతుందని సిబ్బంది తెలిపారు. అదికాస్తా వారం రోజులు పెరిగింది. దీంతో నవంబరు 14న మరోసారి బీమా సంస్థకు వెళ్లారు. వాళ్లు యథాలాపంగా తర్వాత రోజు రావాలని చెప్పారు. ఆ తర్వాతి రోజు కూడా బీమా సంస్థ నుంచి సరైన స్పందన రాలేదు. పైపెచ్చు మూడు గంటలు వేచి చూడాలని చెప్పారు. 

అధికారుల తీరుకు విసుగెత్తిన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో సమాధిలో పాతిపెట్టిన శవపేటిక నుంచి శవాన్ని తీసి బీమా సంస్థకు తీసుకెళ్లారు. ‘ఇదిగో చనిపోయని వ్యక్తి శవం. చూడండి.. ఇంతకుమించిన ఆధారాలను మేము చూపించలేం’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ‘ఓల్డ్ మ్యూట్యువల్’ సంస్థ స్పందించింది. వారికి బీమా నగదు చెల్లించామని వెల్లడించింది.